పుట:కాశీమజిలీకథలు -07.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మోయు కూలివాఁడని యాక్షేపించుచుండిరఁట. ఆబాలుండా మాటలు సైరింపక యొకనాఁ డుపాధ్యాయునితో నార్యా? నేనెవ్వరిజోలికిం బోక చదువుకొనుచుండ నీనాగకుమారులు నన్ను నిత్యము వీఁడు మానిసి. కూలివాఁడు వీనితల్లి పనికత్తియు అని వెక్కిరించుచున్నారు మందలింపుఁడని చెప్పిన జాతిగుణం బెట్లు పోవును. అతండు ఔను. నీవు మానిసివే నీతల్లి రాజపత్నికిఁ పనికత్తి అగుట నిన్ను పుస్తకములు మోయునిమిత్తము దేజోవతితోఁ గూడ బడికి బంపుచున్నారు. లేకున్న నిన్నీ బడిలోఁ జదువనిత్తుమా? నీవు కూలివాఁడవుకాక మఱియెవ్వఁడవు? అభిమానపడిన లాభములేదని యొజ్జలుగూడ నధిక్షేపించిరి.

ఆయూతజూచి బడింగల పిల్లలెల్ల జదువుటమాని వాని నేకరీతిగా నాక్షేపించు చుండిరఁట సహజపరాక్రమశాలియగు నాబాలుం డామాటలు సహింపక యొకనాఁడు బడింగల బాలకులనెల్లఁ బదములతోఁ దన్నియు జేతులతోఁ గొట్టియు గ్రుద్దియుఁ బొడిచియుఁ జిందరవందర గావించెను. ఒక్కడును వాని నెదురుకొనలేక తల యొక దెసకుఁ బారిపోయిరి.

ఆమరునాఁడు బడిగట్టి పెట్టి పిల్లలతోఁ గూడినాయుపాధ్యాయుండు కౌరవ్యు నొద్దకుబోయి దేవా ! మీయింటనున్న దాసీపుత్రుఁడు బడికివచ్చిన నేను జదువు జెప్పఁజాలను. నిన్నను బడిలోనున్న పిల్లలనందఱ జావగొట్టైను. మీయింట దిని పిడుగులాగున నుండుటచే వానితో నెవ్వరును పోట్లాడజాలరు. అని వానిమీఁద లేని పోని నేరములు జెప్పి పిల్లల దెబ్బలం జూపించి రాజునకు గోపము గలుగఁజేసెను.

భూభర్త యాక్షణము జయసింహుని రప్పించి యేమిరా? నీవు కావరించి బడి పిల్లలనెల్లఁ వావమోదితివఁట. ఇది యేమి యాగడము పద్మావతి నీవు మంచివాఁడవని చెప్పినదే నిన్ను శిక్షింతుము. నిజము జెప్పుమని అడిగిన నాబాలుండు భయపడుచు నిట్లనియె

దేవా ! ఇందు నాయపరాధమేమియును లేదు. నిజము తేజోవతికిఁ దెలియును. ఆ చిన్నది నాతప్పని చెప్పినచో మీరు చేసినదండనకు బాత్రుడనయ్యెద. నామె నడుగుఁడని పలుకుటయు నాభర్త తేజోవతిం దీసికొనిరమ్మని అంతఃపురమునకుఁ బరిచారికల నంపెను

ఆసమయమునఁ తేజోవతి యావృత్తాంతము నాతోఁ జెప్పుచున్నది. పరిచారికల వెంట తండ్రి యొద్ద కరిగినది. రాజు తేజోవతి నెత్తికొని పుత్రీ! నిన్న బడిలో నీ జయసింహుఁ డేమిచేసెనో చెప్పుము. పిల్లల నందఱఁ గొట్టెనఁట. నీవు జూచితివా? యని అడిగిన నది యిట్లనియె.