పుట:కాశీమజిలీకథలు -07.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేజోవతి కథ

111

కొంచెము సేపునకు లేచి కూర్చుండి బాలునిదెసజూచి కన్నీరు గార్చినది. బాలునకు మే ముపచారములు చేయుచునే యుంటిమి. పిమ్మట బాలునకుఁ బాలిచ్చినది. కొంత విశ్రాంతి వహించిన పిమ్మట నేనల్లన యప్పల్లవపాణిని సమీపించి యిట్లంటిని. అమ్మా! నీవెవ్వతెవు? నీపేరేమి? ఈమంచముపై కెట్లువచ్చితివి? నీయుదంత మెఱింగింపుము. నీపతి యెవ్వఁడని అడిగిన నమ్మగువ యిట్లనియె.

దేవీ! నేనొక నిర్భాగ్యురాలను నాకులశీలనామంబులు నడుగకుము. నాపేరు కళావతి అని జ్ఞాపకము. ఇక్కడికెట్లు వచ్చితినో నేనెఱుంగను. నీమొగముజూడ, బుణ్యాత్మురాలువలె గనంబడుచుంటివి నేను పరవశనై యుండ నాపుత్రుం గాపాడితివి. నీయుపకారమెన్నటికిని మఱువను. నేను బ్రతికినను లాభములేదు. వీని మీవా నిగా నెంచి పెంచుకొనుఁడు. నేనెందేని బోయెదనని‌ శోకగద్గదయై పలికిన నాలించి నేను ఓహో? ఈయువతి పెద్దయాపద జెంది వచ్చినది ఇప్పుడడిగి యాయాసపరుపఁ దగదు. కొన్నిదినములు గడిచినవెనుకఁ దెలిసికొనియెదగాక అని తలచి మఱేమియు నడుగక తల్లీ! నీవు వగవకుము. నీవును నీపుత్రుఁడును యధేచ్ఛముగా నిందు వసియింప వచ్చును. నీకిది పుట్లి నిల్లనుకొనుము ఏలోపమురాదు. నాకును సంతతిలేదు. నీబాలుని ముద్దుముచ్చటలు జూచుచుఁ గాలక్షేపము జేసికొనియెదవని చెప్పి యామె నూరడించితిని.

నాయోర్పులకు సంతసించుచు నమ్మించుఁబోణి పుత్రునితోఁ గూడ మాయింట వసించినది. ఒకహాయనము గడవకుండఁగనే నేను గర్భవతినై యీతేజోవతిం గంటి. చిరకాలము సంతానము లేక యీ కళావతి వచ్చెడి కొలఁదికాలమునకే పుత్రిక జనించుటచే నాభర్తకు నామెయందును బుత్రునందును ననురాగము గలిగినది. మిక్కిలి యక్కజమగు రూపమునం ప్రకాశించు నీతేజోవతింజూచి యెల్లరు వెరగుపడ జొచ్చిరి. నాగలోకమంతయు నీకాంత చక్కఁదనము గురించి స్తోత్రముబు వ్యాపించినవి. గారవముగాఁ బెంచుచుంటిమి. అయిదేఁడులు ప్రాయము వచ్చినంత కళావతి కుమారునితోఁ జతపరచి జదివింపుచుంటిమి. సింహమువలె గర్జించుచు సమంచిన లక్షణవంతుడగు నాబాలునకు జయసింహుఁడని మేమే పేరు పెట్టితిమి.

జయసింహుఁడు తేజోవతియు నాటపాటలయందును నాహార విహారముల యందును విడువక సంతతము కలిసియుండువారు. క్రమంబున వారిమైత్రి దిట్టమైనది. కలిసియే బడికిఁబోయి చదువుకొని వచ్చుచుందురు.

జయసింహునకుఁ బదియేడుల ప్రాయముగలిగినప్పుడు బడిలో నున్న నాగ బాలురందఱు వానియందీసుగలిగి వీఁడుమానిసి. మానిసి, భర్తృదారికి పుస్తకములు