పుట:కాశీమజిలీకథలు -07.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

కాశీమజిలీకథలు - సప్తమభాగము

భూమియే దాని కాకసము. సూర్యసంచారములేమిం జేసి యంధకారమైయుండును. అత్తిమిర నివారణమునకై బ్రహ్మ ప్రతిసర్పమునకు శిరంబున రత్నము‌ బ్రకాశించు నట్లుఁజేసెను. పర్వతములయందు నున్నత ప్రదేశములయందును గొప్పరత్నములు వెలుఁగు చుండును. వానికాంతులు సూర్యప్రభను మించియుండును. అందు రాత్రిం బగళ్ళ వివక్షతలేదు. నాగకాంతలు మిక్కిలి‌ చక్కనివారు నందనవనమును మించిన యుపవనంబు లనేకములు గలవు. స్వర్గవాసులకు బలెఁ బాతాళవాసులకు గూడ జరా రోగములు లేవు. భోగమునకు నాకము తరువాతఁ బాతాళమునే చెప్పదగినది. దానం జేసియే యిందు గలవారికి భోగులని పేరువచ్చినది.

రసాతలమంతయు నాలుగు రాజ్యములుగా విభజింపఁబడి యున్నది. వానిలో మారాజ్యమే పెద్దది. తక్షకవంశస్థుల కెప్పుడు మాయందు విరోధము గలిగియున్నది నాగులలో వాసుకి వంశస్థులే సాత్వికగుణముగలవారు తక్కిన వారందఱు రాక్షసకృత్యములు గల వారు విషపూరితముఖులై లోకులకు వెరపుగలుగఁ జేయుచుందురు. వారిం బాటింపక నాభర్త కౌరవ్యుఁడు న్యాయంబున రాజ్యము పాలించుచుండెను.

ఒకనాడు రేవతియను నాదాది యత్యాశ్చర్యముతో నాయొద్దకువచ్చి అమ్మా! మన యుప్పరిగపైనున్న హంసతూలికా తల్పంబున ననల్పతేజంబున బ్రకాశించు శిశువుతోఁ గూడ నొక చేడియ బండుకొనియున్నది. ఎవ్వతెవు. అని యెంత పిలిచినను పలికినది కాదు. నిద్రజెందియున్నది కాఁబోలు నీవు వచ్చి చూడుము. అని పలికిన విని నేను సత్వరముగా నామేడమీఁదికి బోయితిని. పందిరలేని యా శయ్యపైఁ బవళించియున్న యాయన్నులమిన్నం జూచి తదీయరూపలావణ్యాదులకు వెరగు‌పడుచుఁ గొంతసేపు ధ్యానించి పరిచారికచే లేపించితిని. ఎంతపిలిచినను బలికినదికాదు. ఆముద్దుల బాలుండామె యురముపై బండుకొని పాలుద్రాగుచుండెను. ఆమె వేషము జూడ బాలింతరాలువలెఁ దోచినది.

ఆబాలునెత్తుకొని ముద్దాడుచు రేవతీ అమ్మా ! వీఁడు మిక్కిలి చక్కనివాఁడు. నీకుఁగూడ నిట్టికొమరుండు గలుగవలయును వానిం జూడ నాగశిశువువలె దోపఁడు. మనుష్యబాలుండని తోచుచున్నడి. వీరెట్లిక్కడికి వచ్చిరో తెలిసికొనవలయునని పలుకుచుఁ జేతితోఁ దట్టుచు నానాతిం బిగ్గరగాఁ బిలిచినది పలుకలేదు. మఱియు నూర్పుల వలన నాయాసము జెందుచున్నట్లు కనంబడినది

అప్పుడు నేను దొందరపడి యొడలు గాపించియు విసరించియుఁ బట్టించియు నుపచారములు బెక్కు జేయించితిని. మూడు దినముల దనుక మాటాడలేదు. నాలుగవనాఁడు కన్నులం దెరచి చూచినది. అప్పుడు నోటిలో నాహారము పోయించితిని.