పుట:కాశీమజిలీకథలు -07.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తేజోవతి కథ

109

కౌరవ్యుఁడు శత్రువులచేఁ బట్టువడెనని తరువాత వార్తలు వచ్చినవి. నాగకాంతల నెల్ల నిప్పుడే దేవరవారి యంతిపురమునకనిపి వచ్చితినని‌ యయ్యుదంతమంతయు నెఱి గించెను. ఆకథవిని విభీషణుడు శోకసంభ్రమాశ్చర్య వివశుండై ప్రహస్తా ? శత్రు హస్త గతుండై కౌరవ్యుం డెంతచింతించునో మనకాప్తుండై యిట్టి యిక్కట్టు జెంద దగునా? యితర వీరసహాయంబునం గాక యేలాపుత్రునకును నందుగల రాత్రించరులకును మనల నెదిరించు పరాక్రమ మెక్కడిది ? వారి శౌర్యదైర్యాదులు మనమెఱుంగనివియా? అవీరుఁడెవ్వడో తెలిసికొనవలసియున్నది. కానిండు నాగకాంతల జెఱఁబడ కుండఁ దీసికొని వచ్చితిరి గదా? మనము తగుప్రయత్నమునఁ బోలు కౌరవ్యుని మఱవ రాజ్యపదస్థునిఁ జేయవలసియున్నది. మన వీఁటంగల సేనలనెల్ల సిద్ధ పఱచి యుంచుము. ఈఱేయి మదభీష్టదేవతం బ్రార్థించి శుభాశుభ ఫలంబులం దెలిసికొనియెదనని ప్రహస్తునకు నియమించి విభీషణుండంతటితో సభచాలించి నాగకాంతల నూరడింప నంతఃపురమున కఱిగెను. అని యెఱింగించి మణిసిద్దుఁ డంతలో వేళ యతిక్రమించుటయు కథఁ జాలించి యవ్వలి మజిలీయందు తదనంతరోదంతం బిట్లని చెప్ప దొడంగెను.

118 వ మజిలీ.

తేజోవతి కథ

అమ్మా ! ఊరడిల్లుము. కౌరవ్యున కేమియుఁ గొదవరానీయరు. మాతాతగారు రెండుమూఁడు దినములలోఁ బోయి యేలాపుత్రుని బుత్రమిత్రకళత్రాదులతోఁ జెరసాలం బెట్టించెదనని శపధము జేసిరఁట వింటివా? మాతాత యెదుట నిలువఁబడు వీరు డెందును లేడు. గొప్పవారికే యాపదలు. తొల్లి మాపెద తాతవలన సీతామహాదేవి యెట్టి యిడుమలం బడినది. నీవు కంటఁ దడి పెట్టిన మాగుండెలు పగిలి పోవుచున్నవి. నీకేలోపమును లేదు. ఈ రాజ్యము నీదిగా భావింపుము మేము జిన్నవారము నీకుఁ జెప్పువారమా? మొదట వారికిని మీకును నీతగవేమిటికి వచ్చినది. యావృత్తాంతము జెప్పుము. అని యంతఃపురమునఁ జంపక తేజోవతి తల్లియగు పద్మావతి నూరడించుచు నడిగిన గన్నీరు దుడిచికొని యామె యిట్లనియె.

పుత్రీ ! మీయిల్లు నాకుఁ గొత్తదికాదు. నీతల్లికి నీ సుగుణంబులు చూచు భాగ్యము లేకపోయినది. నీతల్లియు నేనును దగ్గరచుట్టములము. వెనుక నామెతో నొక తేప నీలంకాపురికి వచ్చితిని. నన్ను బ్రాణపదముగాఁ జూచినది నీవు చిన్నదానవైనను నంతకంటె నెక్కువగా నాదరించుచుంటివి మా వృత్తాంతము జెప్పెద నాకర్ణింపుము పాతాళలోకము నీవెప్పుడును చూచియుండలేదు. భూలోకమున కడుగున నున్నది. ఈ