పుట:కాశీమజిలీకథలు -07.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మేమే విజృంభించి పలు సన్నాహములతోఁ బోయి శత్రువ్యూహముపైఁబడి ఘోరంబుగాఁ బోరుఁ గావించితిమి. దేవా ! ఇఁక జెప్పనేల. అప్పుడు మన బలంబులు ముప్పిరిగొను కోపంబున రౌద్రంబు రూపంబు దాల్చినయట్లు శస్త్రాస్త్రంబులఁ బ్రయోగించియు ఖడ్గంబుల నరికియు గదల మోదియు పరిశువుల నేసియు శూలంబుల గ్రుచ్చియు ప్రాసంబుల ద్రోసియు పట్టంబుల ఘట్టించియు నర్థదివసములో శత్రుపైన్యములనెల్లఁ బీనుఁగు పెంటలం గావించినవి.

మారాయిడికి నిలువలేక కాకోదరబలంబులు దనజానీకముతోఁ గూడఁ దోకద్రెంపిన పిట్టవలె వెన్నిచ్చి తమపట్టణము దెసకుఁ బారిపోవఁ దొడంగినవి. మేమును గొంతదూరము వారిందరిమి విజయ నాదములతో మరల బురిఁజేరి కౌరవ్యునకు సంతోషము గలుగజేసితిమి. నాఁటిదివసంబెల్ల విజయోత్సాహంబునఁ దృష్టిగా వెళ్ళించితిమి మరునాఁడు తెల్లవారినదో లేదో శత్రువీరుల సింహనాదములు భీషణముగా మాచెవులం బడినవి. అపుడు మాబలంబులెల్ల రిపుల నెదిరించినవి. వెండియు నుభయ బలంబులకుఁ బ్రచండభండనంబు జరిగినది.

దేవా ! వినుండు అందొక మహావీరపురుషుండు తురగారూఢుండై యెక్కడఁ జూచినను దాన కనంబడుచు గొఱవిద్రిప్పినట్లు వ్యూహంబులఁ దిఱిగివచ్చుచు మెఱపు మెఱసినట్లు క్షణమొకచోట నిలువక శస్త్రాస్త్రవర్షంబున మన సేనలనెల్ల ముంచిముంచి అందఱకు నందరై యర్దయామములో మమునెల్లఁ గాందిసీకుల గావించెను.

పెక్కేల మనలో నొక్కవీరుండైన వాని‌ నెదిరించినవాఁడు లేఁడు. అప్పుడు వానియాకారము జూడఁ బ్రళయాంతంబున జగంబుల సంహరించురుద్రుండువలె వెఱపుగలుగఁజేసినది. ఇది యతిశయోక్తిగాదు. యదార్దము మేముకాదు ముప్పది మూడుకోట్లు వేల్పులు వచ్చినను వానితోఁ బోరజాలరని రూఢిగాఁ జెప్పగలను.

పిమ్మట మమ్ముఁ దఱిమికొనివచ్చి శత్రుబలంబులు భోగవతీపురంబు ముట్టడించినవి. పౌరులెల్లఁ దల్ల డపడి స్త్రీ బాలవృద్ద సహితముగ నగరంబువిడిచి అడవుల పాలైన పిమ్మట మేమా కోటలోనికిఁ బ్రవేశింపకుండఁ దలుపులు మూసి బురజులపై నెక్కి యోపిన గతిఁబోరితిమి. యామహావీరుని పరాక్రమమునకుఁ గోటలు నగరడ్తలును నాటంకములగునా? ఏలాపుత్రుఁడు కౌరవ్యపుత్రికయగు తేజోవతిని బలవంతముగాఁ దీసికొనిపోయి తనపుత్రుఁడగు పారిజాతునకుఁ బెండ్లి సేయుటకు నిశ్చయించి యావీరుని సహాయమునఁ దలుపులు విదళించి బలంబులనో లోపలఁ బ్రవేశించెను. అప్పుడు మేమేమిజేయుటకుం దోచక వాని దుర్వృత్తినెఱిఁగి తేజోవతితోఁగూడ నంతఃపుర కాంతల నెల్ల నందలంబుల నెక్కించి గుప్తద్వారంబున నిచ్చటికిఁ దీసికొని వచ్చితిమి.