పుట:కాశీమజిలీకథలు -07.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14]

విభీషణుని కథ

105


గీ. కానిచో నింక నాగలోకమున కరయ
    రాజులందఱు లేరు ధర్మప్రసక్తిఁ
    బాలనముసేయు నేకాత పత్రముగను
    బలిమి గౌరవ్యుఁ డొక్కఁడే తెలిసికొనుడు.

శా. లంకాపట్టణ వీరులాస్థవిరబాల స్త్రీసమేతంబు సా
    హండారంబుగ నాఫణీంద్రునకుఁ దోడైవచ్చి యాజిన్నిరా
    టంకం బొప్పఁగ నీబలంబులను జుట్టంబెట్టి వారాశిని
    శ్శంకన్ ముంచెదరింతవట్టు నిజమ స్మద్వీర్యముల్‌ గ్రొత్తలే.

క. ఏలా? పుత్రుకతంబున
   నేలాపుత్రా! యకార్య మీవొనరింపన్
   మేలాపుత్రుని దుర్నయ
   శీలాపత్రవునిఁబట్టి శిక్షింపంగన్.

అని మఱియు ననేక నీత్యుపదేశములతో నేలాపుత్రునకు రాయభారము బంపితమి. అదుర్వినీతుఁడెట్టి ప్రత్యుత్తరము వ్రాయించెనో చూచితిరా? వినుండు.

గీ. దనుజసత్తమ ! మేమెఱుఁగనివి కావు
   నీచరిత్రలు శాత్రవునిం భజించి
   రాజ్యలోభంబునను జేసి భాతృసుత హి
   తాళిఁజంపించి తఘ మింతకన్నఁ గలదె

గీ. విడువఁదగునె వెతలఁబడి కుందుతఱి నన్న
   నెట్టివాడైన వీరుఁడెఱిఁగి యెఱిఁగి
   రిపుపదంబుకట్టి నృపతియై మనుకంటె
   బోరఁ జచ్చి యశముఁబొందు టరిది.

గీ. అన్న జంపించి కొన్న రాజ్యమున నిలిచి
   తేనెఁబూసిన కత్తి చందాన లోని
   దుర్నయంబుల నెల్ల బైఁబోవనీక
   పరమధర్మంబు లెఱిఁగింతువొరులకీవు.

ఉ. నీతివిదుండువోలె రజనీచరసత్తమ: మాకుఁదెల్పె దీ
    చాతురి మెచ్చవచ్చు బలిపద్మమునంగల నాగులెల్ల నీ
    చేతఁ బ్రభుత్వమీయఁబడి చేరినయ ట్లదలించుచుంటి
    వౌఁరా? తలకెక్కెఁ బాడుకలు రక్కసులెంతటి సాధులైరటన్‌.