పుట:కాశీమజిలీకథలు -07.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

కాశీమజిలీకథలు - సప్తమభాగము

చుండ నడుమ వాఁడెట్లో తప్పించుకొని పారిపోయెనఁట పాపమా మాతాశిశువులు క్రిందఁబడుటచే సమసిరని దూతలు వచ్చి యాకథయంతయుఁ దెలిపిరి.

అని యెఱింగించిన విని విభీషణుండు కటకటంబడి మనుమనితో నిట్లనియె? వత్సా ! రక్తాక్షుం డట్టియక్రమ కృత్యంబులం గావించుచుండ నుపేక్షింతివేల? ఇదియా నీరాజ్యపాలనము అయ్యయ్యో? నిష్కారణము దిక్కులేక యక్కాంతయును బాలుండును బలవంతమున మడిసిరే? వాఁడట్టివారి మరియెందఱఁ బరిమార్చుచుండెనో? స్వయముగాఁ బోయి నీవా దానవుని వెదకియేమిటికి శిక్షింతివికావు? పాతాళంబునందలి రక్కసులు మనయాజ్ఞనుల్లంఘించుచుండిరాయేమి? బాగు బాగు. అని యాక్షేపించిన విని బాలవిభీషణుం డెద్దియో చెప్పంబొవుడు నడ్డంబై ప్రహస్తుండిట్లనియె.

దేవా ! దేవరవారు వృద్దులై తాపసవృత్తి‌ వహించుటయు లంకంగల రాక్షసులు మాయాబల శూన్యులగుటయు నరసి రసాతలంబునం గల దానవులు మన యాజ్ఞ మన్నించుటలేదు. తలాతలము కవచమువలె వారిం గాపాడుచున్నది.

అందున్నవారి మనమేమియుం జేయఁజాలము. ఇపుడు మఱియొక యుపద్రవము తటస్థించినది వినుండు.

రసాతలాధిచితులగు కౌరవ్యునకు నేలాపుత్రునకుఁ గన్యకా మూలమునఁ దగవువచ్చి యిపుడు పెద్దయుద్ధము జరుగుచున్నది. తక్షకవంశన్థులకు నందుగల రక్కసులు మిత్రులగుటఁ దద్వంశ సంజాతుండగు నేలాపుత్రుఁడు వాసుకి వంశజుండైన కౌరవ్యుని కూఁతురు తేజోవతికిఁ దనకుమారుఁడు పారిజాతున కిమ్మని అడిగిన నతండొడం బడమినలిగి రాక్షససహాయ బలంబునం గ్రొవ్వి చివరకు రాయభారము బంపెనఁట. కౌరవ్యుండు భయార్తుండై యావార్త మనకుం దెలియంజేసి సహాయము రమ్మనుటయు మీమనుమఁడు వారి కీసందేశమంపెను.

గీ. వలదు యుద్ధము వాసుకి వంగడంబు
    మాకుఁ బ్రాణమువంటిది మదిఁదలంపు
    కడఁగి యన్యాయమునకు విక్రమముజూపఁ
    దగునె కనవె విభీషణు ధర్మబుద్ది.

గీ. అన్న యైనను విడిచెఁ బాపాత్ముఁ డగుట
    శాత్రవుండైన ధర్మవిశ్వాస గరిమ
    నాశ్రయించెను శ్రీరాము నది యెఱింగి
    సంధి గావించుకొనుఁడు రక్షకము గాఁగ.