పుట:కాశీమజిలీకథలు -07.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభీషణుని కథ

103

శా. దేవా! దేవరశాసనంబున సురద్వేషుల్‌ దురాచార దు
    ర్భావంబు ల్విడనాడి సంతతము శ్రీరామప్రభావంబులం
    గైవారంబులు సేయుచుం గథల నాకర్ణింపుచున్ భక్తిఁ ద
    త్సేవాతత్పరులై తపోధనుల రీతింబొల్తు రెల్లప్పుడున్.

మహారాజా ! యువరాజుగా రాజ్ఞాపించుచుండ మనలంకఁగల రక్కసులెల్లఁ దారకమంత్రము జపించుచు నేమంబున మహామునులం బరిహసింపుచుండిరి. దేవతల నాప్తభావంబునం బూజింపుచుండిరి. పుడమియందుంగలదనుజులు మన యాజ్ఞకులోనై వర్తింపుచుండిరి. బ్రహ్మపదంబున సముద్రమధ్యగృహంబునవసించి జీవహింసఁగావించెడి జ్వాలాముఖియనుదానవి విక్రమాదిత్యుని మనుమఁడు విజయ భాస్కరునిచేఁ జంపఁబడినది. ఆగృహము మన వశము జేసికొంటిమని చెప్పిన విని విభీషణుండు ఏమీ? అమ్మహాపాతకురాలు మడసినదియా? అది వరగర్వంబున మనలఁ దిరస్కరించు చుండునది. దానిం జంపినవాఁడు విక్రమార్కుని మనుమఁడా? ఆహా ! ఆ మహారాజు సుగుణ గుణంబులు గంధర్వులు పాడు చుండఁ బెక్కుసారులు వినియుంటిని. మంచిమాట చెప్పితిరి. ఆరహస్యగృహంబున మరెవ్వరేని క్రూరులు చేరలేదుగదా? అని అడిగినఁ బ్రహస్తుం డిట్లనియె

దేవా ! ఆసదనము మనభటులు కాచుచునేయుండిరి. మఱియు జ్వాలాముఖి సోదరుఁడు రక్తాక్షుం డనువాఁడు గర్భభరాలసయైన యొక యువతిఁబతితోఁ దీసుకొనివచ్చి యందు దాచెనఁట. ఆ వార్త గింకరులు మాకెఱింగించిరి. యువరాజుగా రారక్కసునిఁ దోడ్కొని రండని యాజ్ఞాపించిరి. రాజభటులు బోయి యా శాసనము వానికెఱిం గించినవాఁడు బెదురుచు నెదిరించి దొరకక నాపురుషనెత్తుకొని యెచ్చటికో పారి పోయెను. అంతలో నాకాంతకు నెలలు నిండుటయుఁ బ్రసవవేదన యావిర్భవించి మగ శిశువుం గనినదట. ఆకథమేము విని యుపచారములకై కొందర పరిచారకులనంపి నెల దాటినతోడనే యాచేడియను శిశువుతోఁ గూడ నిందుఁ దీసికొని రమ్మని నియమించితిమి. వారునుం బోయి మాతాశిశువులం గడు జాగరూకులై కాపాడుచుండ నానెల లోపల నాపలలాశనుండు వెండి యుజ్జనుదెంచి పరిచారకులుమొరవెట్టుచుండ శిశువుతోఁ గూడ నాచేడియ నెత్తుకొని పారిపోయెను. రక్షకభటు లెరిగి వెంటఁబడి తరముకొని పోయిరఁట. వాఁడు పాతాళములోనికిం బోవుడు భోగవతి నగరోపరిభాగంబున మన భటులు వానిం బట్టుకొనిరి. కాని వాఁడు బాలునితోఁగూడ నాచేడియను గ్రిందికిఁ బడ వైచెను

అప్పుడు వానిం బట్టుకొని మనభటులు పెడికేలు గట్టి యివ్వీటికిఁదీసికొనివచ్చు