పుట:కాశీమజిలీకథలు -07.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఆహా ! పరమభాగవతాగ్రేసరుండైన యీ మహాత్ముంజూచుటను నేను గృతార్థుండనైతిని. నాజన్మ సాద్గుణ్యము నొందినది. నాకన్నుల కలిమి సఫలమైనది. ఇతండు శ్రీరామభక్తులలో ముఖ్యుడు. యుగాంతరములు గతించిన వృద్దుడైనను నీతని తేజము దృష్టులకు మిరిమిట్లు గొల్చుచున్నది. తనువెల్ల నూర్ద్వపుండరములుధరించి తులసీ దామభూషితవ్రతీకుండై యొప్పు నీతని యాకార మెంతమనోహరముగ నున్నదియో? యీ భక్తుని నోటినుండి వెళ్వవడిన వాక్యామృతము గ్రోలి శ్రవణంబులఁ బవిత్రము జేసికొనియెదనని తలంచుచు నతనిఁ జూచుచుండెను.

సభాభవనంబంతయు నిశ్శబ్దంబై యున్నంత విభీషణుఁడు శ్రీరామ మంత్రంబు జపించుచుఁ దత్ప్రభావము సభాసదులకు వివరింపుఁచు

గీ. రామనామంబు జన్మతారకము సకల
    కలుషకానన భూరిపావకము మౌని
    కల్పకము దాని జపియించు ఘనులె మునులు
    సాటిలేనిది సకలార్థసాధకంబు.

సీ. జపియించుచుందురే సద్భక్తి శ్రీరామ
               మంత్రంబు దానవుల్‌ మౌనులట్లు
    పఠియించునే నిత్యపారాయణముగ శ్రీ
               రామాయణం బసుర వ్రజంబు
    కావింతురే రామకళ్యాణములు మహో
               త్సవములం దరసి దానవులు వేడ్క
    భజింతురే యొడ ల్పర వశత్వమునొంద
              దైత్యులారాము నృత్యములు సేసి

గీ. బలిమిఁ గ్రవ్యాదులైన దైత్యులను గండ
    మూలశాల్యన్న ఫలశాక‌ భోజనులుగ
    జేసి సద్వృత్తి గలుగ శిక్షింతురే స
    దా విమర్శింపుచును సమత్వమున మీరు.

ప్రహస్తా ! నాఁడు సీతామహాదేవిని బెదరించిన వికృతాంగుల రాక్షసాంగనలఁ గదలనీయక కట్టిపెట్టి రామమంత్రము జపించునట్లు నియమించితిరా? యోతుధానుల వలన సాధుజనులకు బాధగలుగకుండఁ గాపాడుచుండిరా?. పాతాళంబునంగల రక్కసుల నదలింపుచుండిరా? మాయాగ్రంథములఁ జదువకుండ గుష్తము గావించితిరా? అని యడిగినఁ బ్రహస్తుండు లేచి యెల్లరు విన అతనికి నిట్లనియె.