పుట:కాశీమజిలీకథలు -07.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మరిగెను. అంతలో వారదృశ్యులగుట విభ్రాంతుఁడై దిగ్భ్రమజెంది యందొక దారింబడి పోవఁదొడంగెను.

అని యెఱింగించువరకు వేళ యతిక్రమించుటయు దదనంతరోదంత మవ్వలి మజిలీయం డిట్లని చెప్పందొడంగెను.

117 వ మజిలీ

విభీషణుని కథ

అయ్యో? సుడిగుండమునఁ బడినయీతగానివలెఁ బదిదినముల నుండి యీ పట్టణమునఁ దిఱుగుచుంటిని. అగమ్యగోచరముగానున్నది. విభీషణుని గేహమేదియో తెలిసికొనవలయునని యెఱింగినను గనంబడకున్నది. చంపకనుజూచు భాగ్యము నాకిఁక బట్టదుకాఁబోలు ఈపాటికి రాక్షససేనలు పాతాళమున కేగియుండును. ఇప్పుడు నాకుఁగర్తవ్యమేమి? ఎన్ని దినములిట్లు తిఱుగుచుందును? అన్ని మేడలు జూచినట్లె కనఁబడును. క్రొత్తవివలెఁ దోచుచుండు కాళ్ళు నొప్పి పెట్టుచున్నవి. ఇకఁ నడువఁజాలను. సాయంకాలమగుచున్నది. ఈ కనంబడుచున్న మేడ ప్రవహస్తుని దని వ్రాయఁబడియున్నది. ఈరాత్రి నిందు వశించి విశేషంబులం దెలిసికొనియెద నని తలంచి వీరసింహుఁడు ప్రహస్తుని మేడలోనికిఁ బోయెను.

అందొక శయనగృహంబున భార్యభర్తలిట్లు సంభాషించుకొనిరి.

భార్య - ప్రాణేశ్వరా! నగరవిశేషములేమి ? నేఁడు ప్రొద్దుపోయి వచ్చితిరేల?

భర్త - అబ్బా ? యీ విభీషణుని కొల్వుచేయుట కడుగష్టముగానున్నది. సృష్ట్యాదినుండియు దమోగుణ ప్రధానులగు యాతుధానుల మునులవలె నుండుమనిన నుందురా ? సహజగుణము మానుప నెవ్వరి తరము. ఈ నడుమ శూర్పనకా పౌత్రుడఁగు విదుజ్జీహ్వుఁడు మాయాబలంబున జంపక యంతఃపురమున కఱిగి యామె చెలికత్తె నెచ్చటికో తీసికొనిపోయెనఁట. అది నాయపరాదముగా నెంచి యా మాయావిం బరిభవింపకున్న నిన్ను మన్నింపనని చిన్న విభీషణుఁడు నాపై నలిగెను. విద్యుజ్జిహ్వుని నిమిత్తము పెక్కండ్రు దూతల నంపితిని. వాఁడెక్కడికో పారిపోయెనఁట. వారియింటనున్న మాయాకథప్తుస్తకములెల్ల లాగికొని రాజవశము గావించితిని. నేడాలస్యమైనదని యెరింగించెను

ఆమాటవిని భార్య అర్యా ! పూర్వము లంకలోఁ గల రక్కసుల మాయాశక్తి యంతయునేమైనది. యిప్పుడు వ్యాపకముగాలేదేమి అని యడిగిన భర్త సతీ