పుట:కాశీమజిలీకథలు -07.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంపక కథ

99

చిన్న విభీషణుని పుత్రిక చంపక నాకంటె నించుక చిన్నది. చిన్నతనము నుండియు నేను దానినిఁ బెండ్లి యాడవలయునని యభిలాష పడుచుంటిని దానితండ్రి తాతలకు జయంతునకో మన్మధునకో పెండ్లి చేయవలయునని యున్నధఁట. రావణబ్రహ్మ చనిపోయిన పిమ్మట విభీషణుఁడు రాక్షసులంబెట్టు బాధలు నీవెఱింగియే యుందువు. అట్టివాఁడు నాకుఁ బిల్లనిచ్చునా? శాంబరీపాటవంబున దానిం గొనిపోయి పెండ్లి యాడఁదలంచుకొంటిని. నిన్న విభీషణుఁడు మనుమనితోఁ గూడ శ్రీరంగమున కరిగెనని విని రాత్రి మాయాబలంబున నా యంతఃపురంబునకు వచ్చి నీవే యామెయనుకొని తీసికొని వచ్చితిని. గుఱితప్పినది.

ఇఁకమీఁదఁ జంపకకు నాయందు మోహము గలుగునట్లు నీవు చేయవలయును. నీవు సంతతము చంపకయొద్ద నుందువు. కావున నీవలనఁ గార్యసాఫల్యము కాఁగలదు. నీకు మంచి పారితోషిక మిప్పింతును అని నాతోఁ బెద్డతడ వేదియో గొడవచెప్పెను.

అప్పుడు నేను దప్పించుకొనుటకై వానికనుకూలమగు మాటలాడి కానుక లంది వచ్చితిని. అని యాకథయంతయు నెఱింగించినది.

చంపక మిక్కిలి కోపముతో నేమీ? ఆ పాపాత్ముఁడట్లు గావించెనా? ఈవార్త మాతండ్రి కెఱింగించితివా? లేకున్న నిప్పుడేపోయి చెప్పుము. తప్పక ఆనీచుం బరిభవించును. అనుటయు నది దేవీ ! నీవనకమున్న యెఱింగించితిని. అయ్యగారెద్దియో తొందరలోనుండిరి. పాతాళలోకములోఁ గర్కోటకకులమువారికి వాసుకి వంగడము వారికిని బెద్దయద్దము జరుగనై యున్నదట. వాఱికి వంశజాతులు మనవారిని బాట రమ్మని కమ్మబంపిరట. దానిం జదువుకొనుచున్నారు. ఆ తొందరలో నామాట బాటింపక పోపోమ్ము. పిమ్మట విమర్శింతుములే అని యదలింప నిచ్చటికి వచ్చితిని అని చెప్పినది.

ఆమాట విని ఆబోఁటి అక్కటా! వారికిఁ బోరేమిటికి వచ్చినదియో తెలిసి కొనవలయును. లెండు లెండు అని పలుకుచు సఖులతో గూడ బయలువెడలి చంపక శుద్ధాంతమున కరిగినది.

వీరసింహుఁడు వారి సంవాదము విని మురియుచు నిమ్ముదిత రాక్షసరాజ పుత్రియగు చంపక. దీనికింకను వివాహము కాలేదు. ఏను దీనిని వరించుట తప్పు గాదు. వచ్చినసని మఱచుటతప్పు. ఇందుండి పాతాళమునకు దారి గలదు గదా ? యురగసమరసహాయమున కరిగెడు. రక్కసులవెంట నేనక్కడికిఁ బోయి నా తలి దండ్రుల జాడ తెలిసికొనియెదనని నిశ్చయించి నాచేడియలవెంట గొంతదూర