పుట:కాశీమజిలీకథలు -07.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఓహోహో? కనురెప్ప లెగయ రాగముల వెలయింపుచుఁ గృతుల నాలాపించు నప్పుడు పండువెన్నెలలు గాయ నాణెముత్తెముల వలె నించుక బయల్పడుచున్న పలువరసయందముజూడ శ్రీ శుకునకైనమోహము గలుగక పోవునా! అబ్బబ్బా? అమ్ముద్దుమొగము చక్కఁదనము. అని గంతులువై చుచు నున్మత్తుని భంగి కొంతసేపు ప్రలా పించుచుండెను.

మరల మోహమడంచుకొని అయ్యో? నేనింత మూఢుండనై తినేమి? చాలు జాలు. నీ ప్రోయాలు మగనాలైనచో నా మనసు వ్యభిచారదోషముం బొరయదా? మాతల్లి చెప్పిన నీతివాక్యముల మరచితినేల?‌ పరాంగనల గన్నె త్తి చూడరాదు గదా? ఇది చంపక యగునో కాదో ఇప్పుడు మంగళగీతంబులం బాడుచున్నది గానావసానమున వీరు మాటాడుకొనక మానరు. అప్పుడు వీరి కులగోత్రములం దెలిసికొనియెదంగాక యని నిశ్చయించి యాప్రాంతమందుఁ గూర్చుండి గీతావసానకాల మరయుచుండెను.

ఆ చిన్నది సంగీతము కట్టిపెట్టి యప్పుడే వచ్చి కూర్చుండియున్న యొక చేటికం జూచి చామరికా! నీవు నేఁడింత యాలసించితివేల? నీ కొఱకుఁ. బెద్దతడవు వేచియుంటిమి? పని యేమి గలిగినదని యడిగిన నమ్మగువ యిట్లనియె.

రాజపుత్రీ నిన్నరాత్రి నీ యంతఃపురమున నేను వాడుక ప్రకారము సంగీతము పరిశ్రమ జేయుచుంటి. నీవేమిటికో యక్కడికి వచ్చితివికావు పెద్దతడవు పాడి పాడి నీవు లేమింజేసి నీ మంచముపైఁ బండుకొని గాఢముగా నిద్రపోయితిని. కొంత సేపటికి లేచి చూడఁ ద్రికూట నగరంబునందలి చీకటియింటిలో నుంటి. అప్పుడు శూర్పణకా పౌత్రుడగు విద్యుజ్జింహుఁడు చంపకా! చంపకా! అని నన్ను లేపుచు నేమేమో ముచ్చటింప దొడంగెను. అప్పుడు నేను లేచి ఓయీ? నేను చంపకనుఁ గాను. ఆమె సఖురాలు చామరికను. నన్నేమిటికిఁ దీసికొని వచ్చితివి చంపకతో నీకేమి పనియున్నది. అని యెడదఁబొడమిన వెఱపు బయల్పడనీయక ధైర్యముగా నడిగితిని.

అప్పుడు వాఁడు పశ్చాత్తాపము చెంది అయ్యో? చామరికా నేను నిన్ను రాజపుత్రిక యనుకొని భ్రమపడి తీసుకొని వచ్చితిని. నీవామె మంచముపై బండుకొంటివి కాఁబోలు. కానిమ్ము. నీవు నాకొక యుపకారము చేయుదునంటివేని నిన్ను విడిచి పుచ్చెద లేకున్న నీపని పట్టెదనని బెదరించిన నే నాలోచించి యిట్లంటి కుమారా! మేము పరిచారికలము ఎవ్వరు చెప్పిన పనులనైనంజేసి మెప్పువడయు చుందుము. నాయోపినంత యుపకారముజేసి నీవలన గానుకల నందెద నీయభీష్టమేమో తెలుపుమని నై పుణ్యముగాఁ బలికితిని అప్పుడు వాఁడు నన్ను మెచ్చుకొనుచు చామరికా ? ఇట్లు బలుకుట నీకే తగును. నాకోరిక వినుము.