పుట:కాశీమజిలీకథలు -07.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13]

చంపక కథ

97

చున్నది. దేవలోకములోని నందనవనమునం గల మంచి వృక్షముల నెల్ల పెరికితెచ్చి లంకలో నాటిరిగదా ? ఇంతకంటె రమణీయమగు నుద్యానవన మేలోకమునందు లేదని నిశ్చయింప వచ్చును.

ఇది మిక్కిలి విశాలముగా నున్నది. జలయంత్రముల విశేషములు చూడ వర్షాకాలమువలెఁ దోచుచున్నది. కాలమానముల నల్లిక వేసవిం దెలియనీయదు సర్వర్తు కుసుమ పులభాసురమై యిక్కాన బొడగట్టుచున్నది. ఇందేవసించి దేహయాత్రనడుపు కొనియెదను. నేనెవ్వడనో యేమిటికిందు వచ్చితినో నాకేమియుఁ దెలియకున్నదియని తలంచుచుఁ పరవశమైన చిత్తముతో, అతండు విహరింపుచుండెను.

చంపక కథ

అంతలో నొకమూలం దంత్రీనాదమిళితమైన మనోహరగానం బతనికి శ్రోత్రపర్వము గావించినది. ఆధ్వని విని యదరిపడి బాపురే నాకన్నులకుఁ దృప్తిదీరినది చెవులకుఁ గూడ బర్వము గలుగు చున్నది. అద్భుతగానశ్రవణము అపూర్వ వస్తు సందర్శనముగూడ నాకుఁ గలుగఁబోవుచున్నది. ఇది విభీషణ పౌత్రికయగుఁ చంపక విహరించు కేళీవనమని ప్రకటనలవలనం దెలియబడుచున్నది అనగా నాదము నాపైదలిదేయని తలంచెదను. అదృశ్యుండనగుట నాకెక్కడ బోయినను నాటంకము లేదుగదా చంపకం చూచెదంగాకయని యాలోచించి యానాద మేతెంచినదెసఁకరిగెను.

ఒక గున్నమామిడి క్రిందఁ జంద్రకాంత శిలావేదికపైగూర్చుండి పెక్కండ్రు చెలికత్తెలు చుట్టునం బరివేష్టింపఁ దంత్రీస్వరములతో గంఠనాదము మేలగించి సంగీతము పాడుకొనుచున్న యొక చిన్నది యతని కన్నులం బడినది.

అద్భుతగాన స్వనాకర్ణవంబున నీరైన యతని చిత్తము త్రిలోకమోహజనకంబగు నా కనకగాత్రిం జూచినప్పు డెట్లున్నదో వర్ణించుటకు బృహస్పతికి శక్యము గాదు. ఆమెంజూచి యతండు పరవశుండై నేలం బడెననుట యతిశయోక్తి గాదు. ఒక్కింత వడికిఁ దెలిసి మెల్లనం గన్నులఁదెరచి మెఱపు తీగయుబోలె తత్తనులావణ్యము మిరిమిట్లుగొలుపఁ గన్నులు మూసికొనియె ననుట యధార్థ కథనము.

మఱల మఱల గన్నులం దెరచుచుఁ జేతులచేఁ దుడిచికొని రెప్పవేయక యట్లే చూచుచు వాపోవక యాకోక స్తని నాపాదమస్తకముఁ దిలకించి మేను పులకింప నతం డిట్లు తలంచెను. బళిరా! దైవసంఘటనము. రాక్షసరాజపుత్రికయగు నీ చంపకను దలంచి విద్యుజిహ్వుఁడు విరాళిజెంద నేమో యనుకొంటిని. ఇది యెక్కడి రక్కసి కూన. రక్కసులు వికృతాంగులు కారా? సురగరుడోరగ సిద్ధ విద్యాధరయువతు లీనాతికి దాస్యముసేయఁ బనికిరారని శపథముజేసి చెప్పఁగలను పెక్కేల యొక్కొక్క యవయవము చక్కఁదనము వర్ణింప శేషునకొక్క సంవత్సరము చాలదని చేయెత్తి పన్నిదము చేయగలను.