పుట:కాశీమజిలీకథలు -07.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోగసక్తకథ

7

చూడుము ! చూడుము. అవ్వీటిసింగారంబు హృదయంగమంబును సుమీ అనిపలికిన విని నేను తమకంబేపారఁ గుడిచేతఁ బ్రియుని కంఠంబు బిగియఁ గౌగలించుకొని యించుక తలవంచి యిందలి విశేషములరయుచుంటిని, అప్పుడు దైవికముగా మదీయ శిరోరత్నము కదలి పట్టువదలి క్రిందజారి పడినది. తద్వియోగమునకు వగచుచు నధోభాగ మీక్షించుచున్న నన్నుఁజూచి కొమ్మా! పోనిమ్ము. ఈ మండనమంత లెస్సయాయేమి! వగచెద వేమిటికని నాపతి యడిగిన నిట్లంటిని.

మనోహరా ! ఈ శిరోమణి వివాహావసరమున నా జనకుండు నాకిచ్చె ఈ మంగళమండనంబు నాటంగోలేవిడువక పంతతంబు ధరింతునిది పోవుట యశుభసూచికమని వెరచుచుంటి నెట్లయిన వెదకి తేవలెనని బ్రతిమాలితిని. అప్పుడు విమానమందు నిలువంబెట్టి నా పతియతి జనంబునఁ క్రిందికి బోయివచ్చి మచ్చెకంటీ ! నీ శిరోరత్న మొకమేడపై గుమిగూడియున్న చేడియల నడుమఁ బడినది. దానింగూర్చి యాబోఁటులు మాటలాడు కొనుచుండిరి. ఆడుఁవాండ్రనడుమ కెట్లు పోవుదునని శంకగదుర మరలివచ్చితి. నీవువోయి వారి నడిగి యాతొడవుం దెచ్చుకొనుము. అంతదనుక నేనింద యుండెద నని యుపదేశించిన సంతసించుచు నేనిత్తఱి వియద్గమన పాటవంబున విమానంబు దిగి మీదండ కరదెంచితి ఇదియే నావృత్తాంతము నీభక్తి విశ్వాసములు నాకు మిగుల వేడుకం గూర్చుచున్నవి. నీకెద్దియేని గామితంబున్న నెఱింగింపుము. ఓపుదు నేని తీర్చి యరిగెదనని ప్రీతిపూర్వకముగాఁ బలికిన విని యాజితవతి యిట్లనియెను.

దేవీ ! వసువులు త్రిలోక పూజ్యులని మేము పురాణముల వినియుంటిమి. అట్టి వసుపత్నియైన నీదర్శనము పురాకృత సుకృత విశేషంబున మాకు లభించినది. మేమెల్లంగృతార్థులమైతిమి. నీవు నన్ను సఖియని పిలుచుటచేతనే నేను మనుష్యాంగనలలో నధికురాలనని గర్వపడుచుంటిని. నన్ను నీదాసురాలిగా నెంచుకొని నీ వెంటఁ దీసికొనిపోమ్ము నీ పాద సేవఁ జేయుచుండెదను. జరామరణ రోగభూయిష్టంబగు నీమనుష్యలోకంబున నుండుటకన్నఁ గష్టమున్నదియా? వేల్పులకట్టి యిక్కట్టు లేమియును లేవుగదా ! నాకు దేవత్వము గలుగ ననుగ్రహింపుము. ఇదియే నాయభీష్టమని వేడిన నచ్చేడియంజూచి యోగసక్త యిట్లనియె.

జితవతీ ! జరామరణ రోగములను నెట్లుండును ? వాని వలనంగలిగెడి బాధ యెట్టిది ? మా లోకములో వానిపేరులు మాత్రము విని యుంటిమి. ప్రచారమెట్టిదో తెలియదు. వివరింతువే అని అడుగుటయు రాజపుత్రిక నవ్వుచు నోహో ! మీ యదృష్ట మేమని కొనియాడదఁగి యున్నది. చింతయనునిది యెఱుంగక సంతతము సంతసము జెంది తిరుగుచుందురు. ఇదిగో ముదిమి తెఱఁగరయుము.