పుట:కాశీమజిలీకథలు -04.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వాఁడైన జెప్ప నేమిటికని యోదార్చుచు నల్లన నా సాయంకాలమునఁ గృష్ణుండున్న నెలవుకు వచ్చి యతనిం జూచి విమర్శించి యతనిచేతనున్న చిత్రఫలక మెటులో సంగ్రహించికొని మిగుల సంతోషముతో రాజపుత్రిక యొద్దకు వచ్చి యిట్లనియె. ముద్దియా! నీవు సంకల్పసిద్ధురాలవు. అన్నన్నా! యెంత చిత్రము ఎంతచోద్యము ఔరౌరా! కలలు నిక్కము లగుట నేఁడుగా నిశ్చయింప వలసివచ్చినది. ఈ చిత్రపట మెవ్వరిదో చూచుకొనుము. నీపురాకృతసుకృతము ఫలించినది. విధి విచిత్రసంఘటనములు గావించుచుండును గదా యని పలుకుచు నా చిత్రఫలకముఁ జూపించినం జూచి యా చిన్నది వెఱఁగుపడుచు నిట్లనియె.

సఖీ! నీ మాట లేమియు నా కర్దము కాలేదు. ఏమిటి కట్లాశ్చర్యము నొందెదవు. దీని నెవ్వరు వ్రాసిరి. నిజము చెప్పుమని యడిగిన నప్పడఁతి తరుణీ! వినుము నీవు కలలో సేవించినవాఁడే వచ్చి మీ తండ్రి యిచ్చిన ప్రశ్నమున కుత్తర మిచ్చెను. అతండు మసుష్యమాత్రుండు. కాఁడు. కంతుఁడో వసంతుఁడో జయంతుఁడో కావలయును. నీ వనిన ట్లతనివ్రేల నీ యుంగర మున్నది అంతయు విమర్శించి వచ్చితిని. నీ వెట్లు పరితపించుచుంటివో యీ చిత్రపటము గరమునం దాల్చి యతండు నీనిమిత్త ముత్తలమందుచున్న వాఁడు అని యా కథయంతయుం జెప్పిన విని ముప్పిరిగొను సంతసముతో విని యేమేమీ! నా ప్రాణవల్లభుఁడే వచ్చెనా? నా హృదయతస్కరుని నిజముగా నీవు జూచితివా? నీవు కలలో నాకిట్లు చెప్పుట కాదుకదా? మనమిప్పు డేయవస్థలో నుంటిమి. నిజము చెప్పుమని వేడుకొనిన నా సునంద యిట్లనియె.

ఇది కలగాదు. యథార్థమే శీఘ్రకాలములో నీ యభీష్టము తీరఁగలదు. మాకుఁ బారితోషికము రాగలదని పలికిన నక్కలికి అయ్యో ముహూర్త మెన్నినాళ్ళున్నది? అబ్బా! నీ మాట వినినది మొదలు మేన నెద్దయో తాపము నొడమిన దేమి? నిమిష మీ బాధకుఁ దాళఁగలనా! నీ పాదంబులకు మ్రొక్కెదసు. వాని నొక్కసారి యీ రాత్రి నా యొద్దకుఁ దీసికొని రావలయుఁ గానిచో నన్నచ్చటికిఁ దీసికొని పొమ్ము ఇదియే నీవు చేయు సహాయము. నీవు కడుబుద్ధిమంతురాలవని యనంగ లీలాతరంగితయై ప్రార్దించిన నంగీకరించి యా సునంద యతనిం దీసికొని వచ్చెదనని సువర్ణ లేఖ కభయహస్తమిచ్చి యప్పుడు కృష్ణుని బసకుంబోయి మాటలచేఁ బరిచయముఁ గలుగజేసుకొని యతండు రాత్రి నిద్రించుచుండ మత్తు మందుజల్లి యిరువురి సఖురాండ్ర సహాయముగాఁ దీసికొని యతని జిన్నయందములపైఁ బరుండబెట్టి మెల్లన సువర్ణలేఖ యంతఃపురమునకు దీసికొనిపోయి తల్పంబునఁ బండుకొన బెట్టినది

అప్పుడు సువర్ణలేఖ సునందను గౌఁగలించుకొని కొనియాడుచు గృష్ణుని సాభిజ్ఞానముగాఁ జూచి మేను బులకింపఁ దల కపించుచు మోము మోమున జేర్చి