పుట:కాశీమజిలీకథలు -04.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాతాళబిలము కథ

103

రేపు విమర్శింతము గాని ఇప్పుడు విడిదికిం దయచేయుఁడని యతని నందలముపై యెక్కించి వైభవముతో బస కనిపెను.

కృష్ణు డా వృత్తాంతమంతయు సుభద్ర కెఱిగించి చెల్లీ! నాకు వీరు పెండ్లి చేయుదురఁట. నా హృదయంబునం గల కలకంఠిని విడిచి మఱియొక వాల్గంటి నెట్లు పెండ్లియాడుదును. నాకది సమ్మతముకాదు. మనదారిని మనము పోవుదము రమ్ము. మనయన్న యిందులేడని పలికిన నక్కలికియు నొక్కింత విచారించి కానిమ్ము, తొందరయేమి వలదన్న బలవంతముగఁ గట్టిపెట్టెదరా యేమి? మఱి రెండుదినములు చూచి పోవుదమని సమధానముఁ జెప్పినది. అవ్వార్త సఖులవలన నెఱింగిన సువర్ణలేఖ శుద్ధాంతనిశాంతమునఁ దనప్రాణసఖియగు సునందయనుదానితో నేకాంతముగా నిట్లనియె.

బొఁటీ! నా మాట మా తండ్రి కెఱింగించితివికావుగదా? నీతో నెన్నిసారులు చెప్పితిని. ఇప్పు డేమి చేయవలయునో చెప్పుము. ఎవ్వడో దారింబోవుచు వచ్చి మా తండ్రిగారిచ్చిన ప్రశ్నమున కుత్తరముఁ జెప్పెను. దానంజేసి యమ్మహారాజు వానికి నన్ను వివాహముఁ జేయుటకు నిశ్చయించెనఁట. హా! యెంతకష్టమని నిట్టూర్పు నిగుడించుటయు నా సునంద యిట్లనియె. యోషామణీ! నీయభిప్రాయ మేమియు నుచితముగాలేదు. కలలో నెవ్వనినో వరించితిననియు నితరులం బెండ్లి యాడనని చెప్పెడిమాట పాటింపఁదగినదా? పదివేలమందికిఁ దోచని యుత్తరము చెప్పినవాడు సామాన్యుఁడని యెట్లు తలంచెదవు. దారిం బోయెడువారుగాక మనకు మేనత్తకొడుకు లుండిరా యేమి? చాలు చాలు కలలోఁ గన్నవారికొఱకు నివారించెదవేల ? వినినవారు నవ్వుదురుసుమీ! యని యోదార్చిన నత్తన్వి యిట్లనియె. పుష్పబోణీ! ప్రజలు నవ్విన నవ్వుదురుగాక. నేనేమి చేయుదును. కలలోగన్నవాఁడని చులకనగాఁ బలికెదవు. అది కలయో నిక్కువమో నీకేమి తెలియును. ఇదిగో యిట్టి మనోహరుని విడిచి యన్యు నెట్లు వరింతునో చెప్పుము అని తానొక చిత్రపటముఁ జూపినది.

అప్పుడు సునంద సుందరీ! దీని నీవు వ్రాసినప్పుడే చూచితి నిందున్నవాఁడు కడు సుందరుడగును. ఏమి చేయుదుము. ఎండమావులలోని నీరు తియ్యగా నుండును. దాహ మిమ్మనిన నెట్లు సంపాదింతుము? నీ పలుకు లట్లేయున్నవి అనుటయు నవ్వనిత బోఁటీ! మున్ను బాణాసురుని కూఁతురు ఉషాకన్యక కోరినఁ జిత్రలేఖ యనిరుద్ధుం దీసికొనిరాలేదా? అది స్వప్నగతవృత్తాంతముగాదా ! అయినను నా కిప్పుడు వివాహమున కేమితొందర వచ్చినది. నెమ్మదిగా విచారించుకొందముగాక! నన్ను ముంపిన నా మనోహరుండే కనంబడును. అట్టివాని వెడలఁగొట్టి యన్యునియందు ------------- నోప ఏమన్ననుసరే మాతండ్రిని పోయిజూచి రమ్మని చెప్పినది. అవ్వనిత మాటవిని సునంద సఖీ ! నీవు తొందరపడకుము. ఆరాజకుమారుం ------చూచి యనకూలుండేని నేదియో మిష పన్ని వినిపించెదను. తగిన