పుట:కాశీమజిలీకథలు -04.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అట్లెఱింగినందులకు నిదర్శనము మాత్రము చూపవలసి యున్నది. కానిమ్ము మా దేశములో నన్నెఱుంగనివారెవ్వరు? అవసరమువచ్చినచోఁ దెలియనివారికైనఁజెప్పి సాక్ష్యము దీసికొనిరావచ్చును. తక్కువ వ్రాసికొననేల. ఎల్లరకన్నఁ బదుగురు నన్నే యెఱింగినట్లు వ్రాయవలయునని యెవ్వనికి వాఁడే యూహించి కోటియనియు నాలుగు కోటులనియుఁ బదికోటులనియు నిరువదికోటులనియు నేఁబదికోటులనియు నూఱుకోటులనియు నీరీతిఁ దమసంఖ్య పైనుండవలయునని తన్నెఱింగిన జనులసంఖ్య దమ చిత్తమువచ్చినట్లెల్ల వ్రాసి యిచ్చిరి. అప్పుడు కృష్ణు డూహించి యీ రాజూరక యిట్టి ప్రశ్న వేసియుండఁడు. దీనికెద్దియో కారణ ముండవలయును. నన్నెఱింగిన వా రెవ్వరున్నారు. నన్ననఁగాఁ జర్మాస్థిమయమగు దేహముకాదు. నామనస్సని యర్థము. నా మనస్సులో నేమియుండునో నాకుఁగాక యొరుల కెట్లుతెలియును. నామనంబునఁ గోటానకోటుల సంకల్పములు గలిగియున్నవి. అవి యన్నియుఁ గప్పిపుచ్చి కొన్ని మాత్ర మొరులకు జెప్పుకున్నాను. కావున నన్ను నేనుకాక యొరు లెట్లెఱుంగుదురని నిశ్చయించి యా వాక్యమే పత్రికలో నన్నెఱింగిన వారెవ్వరును లేరు. నన్ను నేనే యెఱుంగుదును అని వ్రాసెను.

కనకాంగదుఁ డా పత్రికలన్నియు బుచ్చికొని వారి వారి వ్రాతలం బరీక్షించి యెకసక్కెములాడుచుఁ గృష్ణుండు వ్రాసిన పత్రికందీసి పరీక్షించి సంతసించుచు నెల్లరునిన ముమ్మారాపత్రికం జదివి యిట్లనియె. రాజపుత్రులారా! తన మది తనకేసాక్షి. తన్ను దాఁనే యెఱుంగు నితరులు తన్నెఱుంగరు. ఇదియే సత్యము. మిగుల బుద్ధిమంతుడగు నీ రాకుమారుఁ డామాటయే వ్రాసెను. అదియే నా యభిప్రాయము. మీరందఱు వేషములచే నధికులేగాని విద్యాగంధము గలవారుగాఁ దోచఁబడరు. మీలో నొక్కనికేని నీ యూహ తోచినదా ? నేనీయుత్తరమే వ్రాసి ముద్రవైచి యుంచితి జూడుఁడు. ఇట్లు చెప్పినవానికే నా పుత్రిక నిత్తునని నిశ్చయించుకొంటినని పలుకుచు నప్పుడాముద్ర విడజించి తాను వ్రాసియుంచిన పత్రికంజూపి చదివి వినిపించెను. దానిలోఁ గృష్ణుండు వ్రాసినమాటలే యుండెను.

అప్పు డందున్న రాజపుత్రులెల్లఁ గృష్ణుని బుద్ధిబలమును మిక్కిలి కొనియాడుచు లజ్జావిషాదములతో మాఱుమాటాడక గూఢముగాఁ దమతమ దేశములకు పోయిరి. తరువాత నా రాజు కృష్ణుని సోత్కర్షముగా సత్కరింపుచు నతనిమెడలోఁ బుష్పమాలికవైచి నీవే నా యల్లుండవు. ధరణీమణితోఁగూడ నా పుత్రికను గైకొనుమని పలికెను.

ఆ మాటలువిని యతం డనంగీకారము సూంచిచుచు దేవా ! మీరు నన్నిందఱిలో బుద్ధిమంతునిగాఁ గణించి గౌరవించితిరి. ఇదియే పదివేలు. నాకుఁ బరిణయముతోఁ బనిలేదు. ఇట్లీ యభిప్రాయముతో మీ ప్రశ్నమున కుత్తరము వ్రాయలేదు. దైవవశంబునం జనుదెంచితినని పలుకఁగా నాతని మాటలు పాటింపక కానిమ్ము