పుట:కాశీమజిలీకథలు -04.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాతాళబిలము కథ

101

బలభద్రుఁడు మాత్రము వినియెను. వాడుక ప్రకారము వేకువజామునలేచి ప్రయాణ మగునప్పుడు బలభద్రుఁడు గనంబడమిఁ దల్లడించుచు సుభద్రయుఁ గృష్ణుండును నలుదెసలం బరికించి కానక ముందరిగెనని నిశ్చయించి యావీడు విడిచి వడివడిం బోవుచుచు బలభద్రా! యని చీరుచుఁ గొంతదూర మరిగిరి. కాని యతని జాడ యేమియుం దెలిసినదికాదు. ఎదురుపడినవారి నడుగుచు నడుచుచుండ నెవ్వఁడో యొకఁ డా దారి గుఱ్ఱమెక్కి పోవుచున్నాఁడని యొక బాటసారి చెప్పిన నా మాటనమ్మి సత్వరముగా గుఱ్ఱములఁ దోలికొనిపోయిరి కాని యతండు గనంబడలేదు. అట్లరుగ నరుగ నా దారి చంద్రకాంతమను రాజధానికిఁ దీసికొనిపోయినది. వారావీటిలోఁ బ్రవేశించి బలభద్రు నరయుచుఁ బదిదినములు వసించిరి. ఒకనాఁ డావీటిలోఁ జాటింపుచుండ విని కృష్ణుండు తాను బసఁజేసిన యింటియిల్లాలితో “అవ్వా ఱేపు దివాణములో సభజేయుదు రనుమాట వినఁబడుచున్నది. ఆ సభ దేనిగుఱించియో యెఱుంగుదువా" యని యడిగిన నా వృద్ధ యిట్లనియె.

అయ్యా! మా పట్టపురాజు కనకాంగదునకు లేక లేక సువర్ణలేఖ యను పుత్రిక గలిగినది. తదీయ రూపలావణ్యాదివిశేషములు వర్ణింపఁ జతుర్ముఖునితరము గాదు. ఆ చిన్నది యిప్పుడు సమారూఢయౌవనయై మెఱుఁగుబట్టిన మరుశరంబోయన మెఱయుచున్నది. అమ్మగువకుఁ దగినవరు నెందునుంగానక స్వయంవరము చాటింపించెను. తన్నిమిత్తముగా ఱేపు సభఁజేయుచున్నాఁడు. ఆ యోలగమునకు వచ్చిన రాజకుమారులలోఁ దానిచ్చిన ప్రశ్నమునకు సదుత్తరమిచ్చినవానికిఁ దన రాజ్యముతోఁ బుత్రికఁ నిత్తునని ప్రకటించియున్నాఁడు. అదియే యా చాటింపని యా యవ్వ చెప్పినది.

కృష్ణుండు మఱునాఁడు సుభద్రకుఁ జెప్పకుండ నా సభకుం బోయెను. మఱియు నానాదేశములనుండి కులవయోగుణరూపవిద్యావిశేషంబుల స్తోత్రపాత్రులైన రాజపుత్రులు పెక్కండ్రువచ్చి యా సభ నలంకరించిరి. పిమ్మటఁ గనకాంగదుఁడు మంత్రిసామంతహితపురోహితసహితముగా నా యాస్థానమునకు వచ్చి నృపకుమారవారంబు గలయం గనుంకొని తదీయరూపవేషభాషావిశేషంబులకు సంతోషింపుచు నీ ప్రశ్నమును బత్రికాముఖముగా వారికెల్ల దెలియజేసెను.

ప్రశ్న - నిన్నెంద రెరుంగుదురు ?

దీనికి నిదర్శనపూర్వకముగా నుత్తరము వ్రాయవలయును. వ్రాసిన యుత్తరమువలన మాకుఁ దృప్తియయ్యెనేని మేమంగీకరింతుము. తాము వ్రాసిన విషయము దృఢపరచుకొనుటకుఁ బిమ్మట వాగ్రూపముగా సమాధానముఁ జెప్పవచ్చును అని యున్న పత్రికం జదువుకొని రాజకుమారులెల్ల దదభిప్రాయము గ్రహింపలేక ఖ్యాతిగలవానినిగదా పెక్కండ్రెఱింగియుందురు వీరిలో నెక్కుడుమంది యెవ్వని నెఱుంగుదురో వానికే తనకూతుఁ నిచ్చు తాత్పర్యముతో నిట్టి ప్రశ్నమువేసెను.