పుట:కాశీమజిలీకథలు -04.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

క. ఒకచేఁ గళ్ళెముగొని వే
   రొకచేతం జిత్రపటము లూనికనుచు నం
   గకములు బులకింపఁగ దలఁ
   చి కొనుచు నేగుదురు తద్వి • శేషములెల్ల న్.

అట్లు కొన్ని పయనములు సాగించి యొకనాడు సాయంకాలమునకు మధుమంత మను పట్టణమునకుం జని యందుఁ బాంథులు నివసింప నియమితంబగు సత్రమున బసఁజేసి భోజనాది కృత్యంబులు నిర్వర్తించి తదంతికవేదికపైఁ గూర్చున్న వారింజూచి యందుఁ గొందఱు విద్యార్థులిట్లు సంభాషించుకొనిరి.

ప్రథముఁడు - మిత్రమా! వీరిం గంటివా? వీరి యాకార భేదములు గనుగొనుట కడుదుర్ఘటము సుమీ!

ద్వితీయుఁడు — వయస్యా! సత్యమే. వీరు సోదరులు కాఁబోలు.

ప్రథ -- సందియమేల. కానిచో నిట్టి యేకరూపత్వ మెట్లు సిద్ధించెడిది.

ద్వితీ - నీ ప్రజ్ఞ చూతము. వీరి జ్యేష్ఠకనిష్ఠభావము లేర్పరుంపుము.

ప్రథ - నాకుఁగాదు. వీరిం గన్నతల్లిదండ్రులకు సైతము తెలియదనియే నా యభిప్రాయము. వీరు కవలపిల్లలు గావచ్చును.

ద్వితీ - ఆ రత్నమాల నురంబునఁ దాల్చినవాఁడు జ్యేష్ఠుడులాగునఁ గనంబడుచున్నాఁడు చూడుము.

తృతీ -- అది రత్నమాలయే?

ద్వితీ - సందియమేల?

తృతీ - ఎట్లు గ్రహించితివి?

ద్వితీ - అభిఖ్యను బట్టి -

తృతీ - (నవ్వుచు) అటులయిన నతండు ధన్యుఁడేకదా ?

ప్రథ - అవి రత్నములుగాక గాజుపూస లనుకొనుచుంటివా యేమి ?

ద్వితీ — కాదు కాదు. వాని శ్లేషవచనములు నేను గ్రహించితిని. నీకుఁ దెలియలేదా ?

ప్రథముడు - ఓహో! అదియా? తెలిసినది. ఈతఁడు ధన్యుఁడు కాఁడు. వీనియురముఁ జేరుటచే రత్నమాలయే ధన్యత్వము నొందెడును.

తృతీయుఁడు - ఆ మాటకు మేమును సమ్మతించితిమి కాని "అకార సదృశ ప్రజ్ఞః" అను నట్లదియుంగూడ నుండవలయుంగదా.

ప్రథముడు - "యత్రాకృతి స్తత్ర గుణాభవంతి" అనినట్లు తగినప్రజ్ఞ యేల యుండకుండెడిది.

అని మాటాడికొనుచు నా విద్యార్థులు నిష్క్రమించిరి. వారి సంవాదము