పుట:కాశీమజిలీకథలు -04.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాతాళబిలము కథ

99

నిడుకొని మోము ముద్దాడుచుఁ దన యుంగరము నా వ్రేలికిడి నా యుంగరము దన వ్రేల నిడుకొని యెద్దియో సంభాషించు నభిప్రాయము సూచింపుచున్నంతలో హా! యెంత కష్టము? సోదరులారా! పైనఁ జెప్పజాలను గదా? అని పలుకుచు మూర్చపోయినది అప్పుడు వారిరువురు నొండొరుల మొగములు చూచికొనుచు సుభద్రను సేదదీర్చి చెల్లీ? నీవు పైనఁ జెప్పనక్కఱలేదు. మాకే బోధపడినది. మనము మువ్వురము నొక్కజాడయే యెక్కితిమి. ఇది యథార్ధము కాదు మహామాయ. దీని కొఱకుఁ జింతింపవలసిన పనిలేదు. మీ రట్టి యానందముతో నున్న సమయమున మొదట నీకుఁ గనబడిన యగ్నిజ్వాల వచ్చి మిమ్మైక్యముఁ జేసికొనినది. నీ వందులోఁ బడి తదర్చిస్ఫురణంబున నెగిరి యిచ్చట వచ్చి పడితివి. ఇదియేనా నీవు చెప్పునది యని యడిగిన నప్పడఁతి వెఱగుపడుచు అన్నలారా! దీని మీరెట్లు గ్రహించితిరి? వింతగా నున్నదని యడిగిన వారు తమ వృత్తాంత మంతయుంజెప్పి యంతయు నొక్క పోలికగా నుండుటచే గ్రహించితిమని పలికిరి.

అప్పుడు సుభద్ర తలయూచుచుఁ దెలిసినది తెలిసినది. ఇదియే భగవన్మాయ. దీనిని దేవతలు సైతము తెలిసికొనఁ జాలరు. మనమెట్లు తెలిసికొందుము. ఇఁక బుద్ధి గలిగి మన మింటికిం బోవుటయే యుచితము. మీ సందియములు దీఱినవియా? యని పలికిన విని వారిరువురు అవును దైవమాయ కడువిచిత్రమైన యింద్రజాలమువంటిది. దీనిని మనము తెలిసికొనలేము. ఇంటికిఁ బోవుదమని సమ్మతించిరి. అప్పుడు వారు గుఱ్ఱము లెక్కి స్వదేశాభిముఖులై యరుగుచు సాయంకాలమున కొకపల్లెం జేరిరి. తాము చూచిన విషయములు మహా మాయయని యెఱింగియు వారు మోహావేశంబునం జేసి హృదయంబున దయితాకారంబుల ధ్యానించుచు విభ్రాంతి పడుచుందురు. అందు బలభద్రుండు దాను జూచిన విషయములు పర్వతశిఖరము మహామందిరము కళ్యాణమంటపము గ్రీడావనము దాను బెండ్లియాడిన చేడియను జిత్రపటంబున వ్రాసి కృష్ణునికిఁ జూపుటయు నతండును తాను బెండ్లియాడిన చేడియను విచిత్రపటము హాటక మత్తగజము ప్రవాహములో నగునవి పటంబున వ్రాసి యన్నకుఁ జూపించెను. వానింజూచి సుభద్ర తన భర్తను ప్రాసాదమును అగ్నిజ్వాలను వ్రాసి వారికిఁ జూపినది ఒండొరులు వ్రాసిన చిత్తరువుల నొండొరులుజూచి విస్మయము జెందుచుండిరి. ఆ పటముల వారు సతతము హస్తములయం దుంచుకొని యా విషయములనే తలంచుకొనుచు యున్మత్తుల కియఁ గొన్న పయనములు సాగించిరి. అని యెఱింగించువఱకు సమయ మతిక్రమించుటయు మణిసిద్దుండు తత్కథఁ జెప్పుటమాని తదనంతరోదంతము పై దిట్లని చెప్పదొడగెను.

ముప్పది యెనిమిదవ మజిలీకథ.

గోపా! విను మట్లు వారు స్వదేశగమనోత్సుకులై గుఱ్ఱములెక్కి యరుగునప్పుడు