పుట:కాశీమజిలీకథలు -04.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాతాళబిలము కథ

93

పదియాఱేఁడుల ప్రాయముగల పెండ్లికూఁతుం బల్లకిలో నెక్కించుకొని యచ్చటికి వచ్చి యా మంటపముపై విడసిరి.

దివ్యమంగళవిగ్రహముగల యా పెండ్లికూఁతుంజూచి బలభద్రుఁడు మోహనిద్రావివశుండై అయ్యారే! ఇయ్యలనాగం బెండ్లియాడిన వానిదిగదా జన్మము. వాఁడు పూర్వజన్మమున నెట్టితపంబులఁ గావించెనో? ఎట్టి దానధర్మముల నాచరించెనో! ఎట్టి పుణ్యకార్యంబులం జేసెనోకదా! కాకున్న నిట్టి చక్రవాకస్తని నిట్టి వైభవముతోఁ బెండ్లియాడఁగలుగునా! సీ! మనుష్యలోకముకన్నఁ బాడులోకమేదియునుం లేదు. భూలోకమునం గల కలకంఠుల సోయగమంతయుం గలిసినను నీకలికిమిన్న నఖాంచలమునకు సాటిగాదు. ఇసిరో! మేము చక్రవర్తులమనియు సార్వభౌములమనియు గర్వించు నృపతుల యైశ్వర్యమంతయు నిక్కాంతారత్నము కనిష్టకాంగుళీయరత్నమున కెనగాదు. ఇట్టి జగన్మోహినిం బెండ్లియాడు పురుషుఁ డెంతవాడో? ఎట్టి సోయగముగలవాఁడో? యెట్టి యైశ్వర్యము గలవాఁడో? చూచి వినోదించెదంగాక? అదియే నా జన్మమునకుఁ జాలునని తలంచుచు నందొకమూల నొదిగి యా వింతలం జూచుచుండెను.

అప్పుడు వారిలోఁ బురోహితుండు గురుపీఠంబునం గూర్చుండి ముహూర్తము సమీపించుచున్నది. పెండ్లికొడుకుం దీసికొనిరండు. సంకల్పము జరిగించ వలయునని పలుకఁగా నచ్చటివారి చూపులెల్ల బలభద్రునిపై వ్యాపించినవి. పిమ్మట నతఁడే యతఁడే యను ధ్వని యొకటి బయలువెడలినది. అప్పుడు బలభద్రుడు బెదురుగదురఁ దెల తెలఁపోయి చూచుచుండెను. అంతలో నిరువురుకాంత లతని చెంతకువచ్చి చేతులుపట్టుకొని రమ్ము రమ్ము నీవు పెండ్లి కొడకవైతివి. మంగళస్నానము చేయింతుమని పలుకఁగా నతం డానందసాగరనిమగ్నహృదయుండై యేమియుం దెలియక యేమియుం బలుకనేరక వారు చెప్పినట్లు చేయుచుండెను.

ఆ యువతు లతని దీసికొనిపోయి పన్నీట స్నానము చేయించిరి. మఱికొందరు సుందరులు తడియొత్తిరి. వేఱొకరు ధూపమువైచి తలయార్చిరి. ఇంకొకరు నూత్నమాల్యానులేపనాభరణాదుల నలంకరించిరి. పురోహితుండు ఫలయుక్తంబగు తాంబూలంబు జేతికిచ్చి తీసికొనిపోయి వివాహవేదికాపీఠంబునం గూర్చుండఁబెట్టి బెట్టిదముగఁ దూర్యనినాదములు మ్రోగుచుండ సంకల్పముఁ జేయించి యథావిధిఁ బుణ్యాహవాచనపూర్వముగా వైవాహికమంత్రంబులు పఠించుచు నయ్యించుముఁడిని దెరమఱుగున నుంపించి పాణిగ్రహణవిధి జరిపించెను. పిమ్మట నతం డాకొమ్మ కంఠమ్మున మంగళసూత్రంబు ఘటియించెను. తరువాత వారొండొరులు ముత్తెములతోఁ దలంబ్రాలు పోసికొనిరి. అట్టి సమయమునం నతనిడెందమునం గల యానందం బెట్టిదని చెప్పుటకు జిలువఱేరికైన వశంబుగాదుగదా! పిమ్మట నా పొన్నకొమ్మ నతనిచెట్ట బట్టించి వారెల్ల మెల్లమెల్లగా వచ్చినదారింబట్టి యాకందరాంతరంబున