పుట:కాశీమజిలీకథలు -04.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

కరిగిరి. అప్పుడు బలభద్రుండు మేనఁ జెమ్మటలుగ్రమ్మ సిగ్గునం దలవాల్చి తన ప్రక్కనిలిచియున్న యజ్జవరాలి సోయగము పలుమాఱు సూచుచు మోము చెన్నుఁ జెక్కులఁతళ్కు నుదురుపౌరుఁ గైవారముసేయుచుఁ బల్కరింపఁబోయి డగ్గుత్తిక వెలుంగురాక తలయూచుచు నాచిగురుఁబోడి చేయిపట్టుకొని యా మంటపము దక్షిణ భాగముగా బదియడుగులు నడిచెను.

అందొక యుద్యానవనము నందనమువలె వారి కన్నులకు విందొనరించినది వింతలపై వింతలు గనంబడుచుండ నత్యంత సంతోష సాగరమున నీదులాడుచుఁ దన పూర్వ వృత్తాంతము మఱచి యత్తరుణీలలామ చిటికెనంబట్టికొని కొంతతడ వత్తోటలో విహరించెను. తరువాత నా నాతిని మాటలాడింపదలచి యొక లతామండపమునఁ గూర్చుండి యింతీ! నీ పేరేమి? ఎవ్వరి కూతురవు? ఈ లోక మెయ్యది? నీ వృత్తాంతము వాక్రుచ్చి నాకు వేడుక నొనరింపుము. నీ మృదుమధుర సంభాషణము లాలింప మదీయశ్రవణంబులు సంతసము జెందుచున్నవి. సానునయనముగాఁ బలికిన నచ్చిలుకలకొలికి కలికిచూపు లతనిపైఁ బరగించుటయేగాని యేమియుఁ బ్రత్యుత్తర మిచ్చినదికాదు. అప్పు డతండు సందియమందుచు నీ యోషామణికి నా భాష తెలిసినది గాదా? లేక సిగ్గునం బ్రత్యుత్తరమిచ్చినదికాదా! ఆహాహా! నా చరిత్ర తలంచుకొనిన నబ్బురమిట్టిదని తలఁపశక్యము కాదు. నే నెవ్వఁడ నీ జవ్వని యెవ్వతె? ఈ గుహ యెక్కడ? క్రొత్తవాఁడనగు నన్నుఁ బరీక్షింపక నాకీ కన్యకం బెండ్లి చేయుట యెట్టిది? నే నిచ్చటికి వత్తునని యంతకుమున్ను వీ రెఱుంగురా యేమి? ఇది యంతయు నిక్కువమే! కాదు కాదు. కలయే యైయుండవచ్చును. అగుంగాక! ఇట్టి నెలంత నాచెంతఁ బత్నిగా నిలిపిన భగవంతునియుపకృతి యెంతయని కొనియాడుదును దీని హృదయముఁ దెలిసి విహరింపవలయును. అనుకూలముగానే యున్నట్లు తోఁచుచున్నది. చిటికెనవ్రేలి యుంగరముల మార్చిన నంగీకరించినదికాదా? మఱియు నే నెటకరిగిన నటకు నంటివచ్చుచుండుటయు బ్రీతికి సూచకమే. మాటాడకున్న నేమి? శృంగారలీలలు వెలయించి సిగ్గు వాయఁజేసెదఁ గాక యని తలంచుచు నల్లన నప్పల్లవపాణి యధరపానకంబు గ్రోలంగను నుంకించు సమయంబున మున్నుజూచిన సోకుదయ్యము చప్పుడు వినంబడినది.

ఆ ధ్వని విని యతం డదరిపడి బెదరుతో నలుదెసలం బరికింప నొక పెడదాపుననే యుద్యానపాదపంబుల మొదలంట నూడనెగర జిమ్ముకొనుచు నా జంఝామారుతప్రవాహము వడివడిగా విసరుచుండెను. దానింజూచి యతండు బెబ్బులిం గనిన సారంగము తెఱంగున నంతరంగమున జడియుచుఁ గర్తవ్యము దెలియక యా కలికి చేయింబట్టుకొని రెండవదెసకుఁ బరుగిడ దొడంగెను.

అంతలో నా జంఝామారుతం బాక్రమించి యుద్యానతరులతావితతితోఁ గూడ నా దంపతుల దూదిపింజలవలె నెగరజిమ్మినది. బలభద్రుం డొకసుడివిసరునం