పుట:కాశీమజిలీకథలు -04.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పింజమువలె నెగిఱిపోవుదును. ఇఁక బ్రతుకెక్కడిది. ఈ శైలమున సుఖముగాఁ నుందమనుకొన్న నీ యుపద్రవము తటస్థించుచున్నది. అన్నా! స్వర్గమునకుఁ బోయినను నిడుములు నన్ను విడువవు కాఁబోలు నని విచారించుచుండ నా గాలి కొంచెము దూరముగా మఱియొకదెస కరుగుచున్నట్లు కనంబడినది.

అతండప్పుడు కొంత సంతసించుచు మఱియొకమూలకు పోయి యచ్చటి విశేషములు చూచుచు నరుగుచుండ నొక్కచో రత్నసానుకవాటమండితంబైన ద్వారమున నలంకరింపబడిన గుహయొకటి కనంబడినది. ఆ ద్వారముఖస్థగితరత్నరుచిని చయములు కన్నులకు మిరుమిట్లు గొలుపఁ బలుతెఱంగుల వెఱఁగుపడుచు నతం డతి సాహసముతో నా గుహలోఁ బ్రవేశించి నడువఁ జొచ్చెను. పెక్కేల? అందుగల వింతలు వైజయంతమున సైతము లేవని చెప్పవచ్చును. జనశూన్యంబైన యిక్కందరాంతర మిట్టి యలంకారమున భాసిల్లుటకుఁ గారణమేమియో యరసెదంగాక యని పోవఁబోవ నొకచోటఁ గళ్యాణమంటపము కనంబడినది. నవరత్నకల్పితములైన స్థంభములచే శోభిల్లు నామంటపమధ్యభాగమునఁ బెండ్లిపీట వేయఁబడియున్నది. దాని ముందర వివాహమంగళకృత్యమునకుఁ గావలసిన సామగ్రియంతయు సవరింపబడి యున్నది. వధూవరులు ధరింపఁదగిన రత్నభూషాంబరము లద్భుతదీప్తిదీప్తము లగుచుండ నొకకనకపాత్రంబున నమరుపఁబడియున్నవి. పుణ్యాహవాచకకలశములు రసాలకిసాలాచ్ఛాదితములై యున్నవి. ఆ సామగ్రియంతయుఁ జూచి బలభద్రుండు ఓహో! నాకుం గన్నులు కలిగినందులకు నేఁడుగా సాద్గుణ్యమైనది. మనుష్యుల కెన్నడైన నిట్టి యద్భుతవిషయంబులఁ జూడ తటస్థించునా? ఇందుగల యొక రత్నమునకుఁ భూలోకమునంగల సంపదయంతయుఁ దులకాదు. నేను పూర్వజన్మమున సుకృతమేల చేసితిని. మా తమ్మునికిఁ జెల్లెలికి నిట్టి వింతలంజూపు భాగ్యము లభించినదికాదుగదా! నేనుబడిన బిలములో వారునుం బడినచో నిచ్చటికి వత్తురు మేము కలిసియే యిట్టి వింతలం జూచినచోఁ జెప్పనేల? ఈ మండపము దేవతలు పెండ్లియాడు కళ్యాణమంటపము కాఁబోలు. ఇప్పు డెవ్వరికో బెండ్లిచేయుటకై సర్వసన్నాహములు చేయఁబడి యున్నవి. అదియు నా కన్నులం బడినచోఁ గృతార్థుండ నయ్యెదను.

అని తలంచుచున్నంతలో నతనికి మంగళవాద్యధ్వనులు వినంబడినవి "ఓహో! పెండ్లివా రిచ్చటికే వచ్చుచున్నారు కాఁబోలు? ననుఁజూచి శపించరుగద! ఏల శపింతురు? నేనేమి తప్పుజేసితిని. పోనిమ్ము కానున్నది కాకమానదు. ఇది యంతయు నా ప్రయత్నముననే వచ్చినదా యేమి? యని తలంచుచు వారిరాక కెదురుచూచుచుండెను. అప్పుడా దరీమందిరమునుండి కొందఱు పురుషులును స్త్రీలును వచ్చిమాల్యాంబరాభరణాదులు ధరించి ముందర మంగళవాద్యములు మ్రోగుచుండఁ