పుట:కాశీమజిలీకథలు -04.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాతాళబిలము కథ

91

ప్రభాధగద్దగితంబై ఫలితవికసివిత లలిత తరులతామనోహరంబై మధుర జలనిర్ఝర పరిపూర్ణంబై యొప్పుటంజేసి విస్మయావేళ వివశహృదయుండై యొక్కింత తడవు ధ్యానించి యందలి మలయమారుత పోతంబులు మేనికి హాయి సేయ నించుక బలము కలిగి లేచి కూర్చుండి నలుమూలలు సూచుచు నాకలియుం దప్పియుఁ బెద్దతడవునుండి బాధించుచున్నవి గావున నచ్చటి ఫలంబులంది కోసికొని కడుపునిండఁ దిని నిర్ఝరజలంబులం గ్రోలి యందలి వింతలం జూచుచు నిట్లు ధ్యానించెను. అయ్యో? భగవంతుని మహిమ దెలిసికొనుట కడుదుర్బటముగదా. మేమెద్దియో పేరువడయుదమని తగని పనికిఁబూనికొని పెద్దలమాట నిరసించితిమి వృద్ధాచారములేల యసత్యములగును? భగవంతుని బాషాణప్రాయునిగాఁ దలంచి నిందిచుటచే నతండు నన్ను బంధువుల కెడఁజేసి యీ యధోలోకమునం బడవేసెను. పోనిమ్ము. మా తమ్ముడును, జెల్లెలును సుఖించినం జాలుఁగదా? అక్కటా? మఱచిపోయితినే? గాఢాంధకారబంధురంబైన కంటకప్రదేశముల నుండి వా రేయధోగతిం బొరసిరో? అధోగతిం బొరసినను నా పనియే మేలైనది. ఆహా! ఇచ్చట సూర్యుఁడు లేకున్నను నిట్టి వెలుతు రెచ్చటినుండి వచ్చుచున్నదోగదా? తెలసినది. రత్నప్రభలే పట్టపగలు చేయుచున్నవి.

అన్నన్నా ! ఈ శైలంబు కైలాసంబో మేరుగిరియో కావలయుం గానిచో నిందుగల పాషాణంబు లన్నియు రత్నములు, భూమి యంతయు బంగారముగా నేమిటి కుండును? స్వర్గమనునది. యిదికాదుగద! ఈ వృక్షంబులు కల్పవృక్షంబువలెఁ దోఁచుచున్నవి. కాదు స్వర్గము మీదుగా నుండునందురు. అయ్యో? ఇది యంతయు నిక్కువమని నేను భ్రమపడుచుంటిని స్వప్నములో నీవింత లన్నియుం గనంబడుచున్నవి కాఁబోలు. ఇది కలగాదని యిందాక మేమనుకొంటిమే. అ ట్లనుకొనుటయు స్వప్నములోని వార్తలే కావచ్చును. ఏదియుంగాదు. దైవమాయ యని నిశ్చయించినమాట మఱచిపోయితినేల ఏది యెటులయిననేమి. ఈ గిరిశిఖరవిశేషంబు లరసెదంగాక.

అని యనేకప్రకారంబులఁ దలంచుచు బయలువెడలి యప్పర్వతశృంగశృంగాటకంబునం బర్యటనంబుఁ గావింపఁజొచ్చెను. అట్లు తిరుగుచుండ నక్కొండ ప్రక్క మిక్కుటమగు వేగమున గొప్ప చప్పుడు లుప్పతిల్లం బెల్లుకొను వెల్లువంబోలెఁ బరాగ శూన్యంబై గాలివిసరఁజొచ్చినది. త్రిశూలధారులును విభూతి రుద్రాక్షమాలికాలంకృతులు బాలశశాంకశేఖరులు నగు పురుషులు కోటానకోటులు దాటియాకులవలె నా గాలిలోఁ గొట్టుకొని పోవుచుండిరి తుదమొదళ్ళు లేక యేకరీతిగా విసరుచుండెడి యా జంఝామారుతప్రవాహములో నా పురుషులు కట్టెలయట్టుల గొట్టుకొని పోవుటఁ జూచి బలభద్రుండు విస్మయ సాధ్వసంబులు చిత్తంబుత్తల పెట్ట నయ్యో! ఈ గాలి సోకినంత పర్వతములైన నెగిఱిపోవును. ఈ గిరిని సోకకుండ నొకదండగాఁ బోవుచున్నది. క్రమక్రమముగా దీనిమీఁదికి వచ్చునేకదా. వచ్చినచో నేనీగిరితో ధిమో