పుట:కాశీమజిలీకథలు -04.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యాకలియే చెప్పుచున్నది. అమ్మహానుభావుని వేఁడుకొనుటయే యిప్పుడు కర్జము అంతకన్న వేఱొక సాధనము లే"దని పలికినది. ఆ చిన్నదాని మాటలు విని వారును మనంబున సందియమందుచు నంతకుమున్ను నిందించిన వాక్యములన్నియుఁ బరీక్షార్థమే కాని యథార్థములు కావని లెంపలు వాయించుకొనుచుఁ బశ్చాత్తాపచిత్తములతో నమ్మహాత్ము నిట్లు స్తుతించిరి.

సీ. కాశి కేగఁగఁ గానఁ । గారాక రామేశ్వ
                  రమునకుఁబోవ ద । ర్శన మొసంగఁ
    కల కంటిలో జాడఁ । దెలుపక వేంకటా
                  చలమునఁజూడ సా । క్షాత్కారింప
    కమరాద్రిఁ గనఁగఁ బ్ర । త్యక్షంబుగాక సా
                 కేతంబునను నెమ । కినను లేక
    కేదారమాయావు । రాదితీర్థములఁగా
                లించి వెదకిననుఁగా । న్పించవై తి.

గీ. హరివొ హరుఁడవొ శక్తివో । యనుచు నిన్ను
    నయ్యయ్యో ? తెలియనట్టి మ । మ్మంధకార
    కూపమునఁ గూలఁ ద్రోయుదే కోపమునను
    సకలజకదీశ సర్వేశ । శరణు శరణు.

అని ఫాలంబులం గేలుగీలించి వారు నుతింపుచున్న సమయంబునం దళుక్కుమని యొక్కమెఱపు మెఱసినది. ఆ మెఱపు వెలుతురున నాప్రాంతమం దొకమందిర మున్నట్లు కనంబడుటయు బలభద్రుఁడు లేచి తమ్ముడా! దాపున ద్వారము కనంబడినది చూచితివా? ఈగృహ మెవ్వరిదో యరసి వచ్చెద. వెలుతురు వచ్చుదాక మనమందు విశ్రమింతమని పలికి తడవుకొనుచుఁ బదియడుగు లటు నడచెను. అప్పు డతఁడొక బిలములోఁ బడిపోయి హా! కృష్ణా! హా! తమ్ముడా! హా! సుభద్రా! హా! చెల్లెలా! నేనొక గోఁతిలోఁ బడిపోయి జారిపోవుచుంటి. మీ కంటికి నేనిఁకఁ కనంబడనని యొక్క కేక పెట్టెను. ఆ ధ్వని విని వారదరిపడి హాహాకారముతోఁ బరుగిడి యతండు పడిన గర్తములోనే పడిరి. కాని వానిం గలిసికొనలేక పోయిరి.

పాతాళబిలము కథ

బలభద్రుం డట్లు పాతాళవివరంబునం బడి యొడలు నొవ్వకుండఁ జుట్టు నిసుమురేణువులు రాచికొనుచుండ జాఱిజాఱి స్మృతి తప్పి పదిదినంబుల కొకకొండశిఖరంబునం బడియెను. దూరపతనశ్రమవలన నించుక తెలివి వచ్చిన నతండు కన్నుల దెఱచి చూచి యగ్గిరికూటంబు హాటకతటఘటితంబై పృధుల వివిధరత్న .