పుట:కాశీమజిలీకథలు -04.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహామాయ కథ

87

ధారు వైకుంఠంబన ప్రసిద్దివడసిన యా దివ్యక్షేత్రమున నా రాజపుత్రుఁ డొకమాసము వసించి పరకానదీ నదృశంబగు కావేరిం దీర్థములాడుచు రంగనాయకుని సేవించుచు వైష్ణవులతో ముచ్చటించుచుఁ దన్మహిమ నరయుచుండెను. కాని యేదియుఁ దనమది కచ్చెరువుఁ గులుగఁజేసినదికాదు. అతండారీతిఁ బుడఁమి గల విష్ణుక్షేత్రంబులం దిరిగెను. ఎందును దనమదికి నమ్మకమైన మహిమ నేమియుంగానక విష్ణు భక్తులఁ బరిహసించుచు దైర్థికుల నాక్షేపించుచుఁ గ్రమంబున ద్వారకకుఁ జనియె. అందుఁగల తీర్థవిశేషము లరయుచు మృతినొందిన వారియెమ్ముల శంఖచక్రగదా చిహ్నము లుండునని చెప్పినమాటల యథార్థముఁ దెలిసికొను తలంపుతోఁ బితృవనంబుకుబోయి యస్థులం బరీక్షించుచున్న సమయంబున నాదారిని కృష్ణుండు గుఱ్ఱమునెక్కి వచ్చుచుండెను.

వానింజూచి సంతసముతోఁ బిలిచిన నతండును బలభద్రుండని యెఱింగి గుఱ్ఱముదిగి దాపునకు వచ్చి యన్నం గౌఁగలించుకొనియెను. అతండును దమ్ముని గౌఁగలించుచుఁ గుశలప్రశ్న చేసి మనచెల్లె లెందున్నదో యెఱుఁగుదువా? ఎందుండి వచ్చుచున్నావు? విశేషము లేమైనం గనంబడినదియా? యని యడిగిన నతం డన్న కిట్లనియె. “ఆర్యా! నీ వీ స్మశాన భూమింగూర్చుండి యేదియో వెదకుచుంటివేల? నీ వెందెందుఁ దిరిగితివి? ఇక్కడి కెప్పుడు వచ్చితివి? గ్రామములోనికిం బోవుదము రమ్ము మన సుభద్రయు రాత్రికిచ్చటికి రాఁగల" దని పలికిన నతఁడు "తమ్ముఁడు నేను బుడమిఁగల విష్ణుక్షేత్రములన్నియుం దిరిగితిని. ఎచ్చటను దైవశక్తి యేమియుం గనఁబడలేదు. మూఢమానవు లా యుత్సవములుచూచి సంతోషించుచుందురు. ఇచ్చటఁ జచ్చినవారి యెమ్ములలో శంఖచక్రాది చిహ్నములు గనంబడునని కొందఱు చెప్పిరి. ఆ విషయము విమర్శింప నిచ్చటికి వచ్చితిని. ఇంతలో నీవు కనంబడితివి. చూడుమిదిగో యీ గీఁతలం జూచి శంఖచక్రము లని లోకులు భ్రమయుచుందురు. ఇవి నీ కెట్లు కనంబడుచున్నవని యడిగిన నతండుచూచి యివి గీఁటులేకాని చిహ్నములు కావని నిశ్చయించి చెప్పెను.

పిమ్మట వారిరువురు వీటిలోనికింబోయి యొకచో నివసించిరి. కృష్ణుం డన్నతో “నేనును దేశమెల్ల గ్రుమ్మరితిని. శివక్షేత్రములన్నియు వితర్కించితినిగాని యెందు నే మాహాత్మ్యము గనంబడలేదు. కాశీపట్టణములో రెండునెలలు వసియించితిని. అందు మృతినొందు జనుల చెవులలోఁ దారకేశ్వరుఁడు తారకమంత్ర ముపదేశించుననియు దానంజేసి కుడిచెవి పైకి వచ్చుననియు జెప్పిరి. ఆ విషయము వితర్కించితిని. జంతువుల కచ్చట నట్లువచ్చుట మాత్రము నిక్కువమగును. తరువాత నొక చార్వాకసిద్ధాంతి గనఁబడియెను. వానితో నీ విషయము ముచ్చటింపఁగా నది దైవరహస్య మనియు నచ్చట భూమియందున్న యుష్ణమున మరణకాలమం దవయవముల గాల్చు ననియుం జెప్పి నా సందియముఁ బోగొట్టెను. అంతకన్న వేఱొక్క