పుట:కాశీమజిలీకథలు -04.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

ప్రధానత్వము నిశ్చయింతిమేని లోకోపకారముగనుండును మనల సృష్టించిన భగవంతు డొక్కఁడుగాని యిరువురుండను అమ్మహాత్ముఁడెవ్వడో తెలిసికొనుట యావశ్యము. కావున మనము తండ్రిగారికిఁ దెలియకుండ దేశాంతరమరుగుదుము. ఒక సంవత్సరములో నన్ని విశేషములును దెలిసికొని రావచ్చును. నీవు శివక్షేత్రములకరుగుము నేను విష్ణుక్షేత్రములకరిగెదను. అందు మనస్సునకు దృఢముగా నమ్మకమైన విషయమే మనము గ్రహింపవలయు ఒకరు చెప్పినదానిని నమ్మవలదు. ఇందులకు నీ యిష్టమే" మని యడిగిన గృష్ణుండిట్లనియె.

"అన్నా! నీ యభిమతమే నా యిష్టము, నీ యూహ సమంజసముగా నున్నది. ఈ రహస్యము మనచెల్లెలు సుభద్రతోఁ జెప్పిపోవలయు లేకున్న నా చిన్నది మనలఁ గానక పరితపించెడు ఇంతకు మున్నెన్నడును మనల విడిచియెఱుంగ" దని నుడువిన విని యతండందుల కియ్యకొని యప్పుడే వారప్పడఁతియొద్దకుం జని తమయుద్యమ మెఱింగించి యల్లన నిట్లనిరి "చెల్లీ ! మేమిప్పుడు లోకోపకారకమగు పనికై దేశాటనముఁ జేయఁబోవుచున్నారము. సంవత్సరములోపునే తిరిగివత్తుము. మేమరిగిన వెనుక మనతండ్రితో నీ తెఱం గెఱింగింపుము. ఇది పరమరహస్యము మాకొఱకు నీవు చింతింతువని నీకుఁ జెప్పి పోవుచున్నాము. నీవు విచారింపవల" దని చెప్పిన విని యతన్వి కన్నీరు గార్చుచు నిట్లనియె.

"అన్నలారా! పుట్టిననాటఁగోలె మిమ్మువిడిచి యుండలేదు. తల్లిదండ్రుల కన్న మీ యొద్దనే నాముద్దు చెల్లుచుండును. మీరు దేశాంతర మరుగుఁ నొంటిగా నింటనుండజాలను నాకుఁగూడ నొకపని నియమింపుడు. నమ్మకముగాఁజేసి జన్మము సార్థకము నొందించుకొనియెదను. పరదేశమున నాఁడుదాని వెంటఁ దీసికొనిపోవుట శ్రమకరంబని సంశయింపవలదు. నేనుగూడ పురుషవేషము వైచికొని తిరిగెదను. మీ రనుమతింపక తీఱదని పలికిన వారెట్టకే నంగీకరించి శక్తిమహిమ నరయ నత్తరుణికి వంతువైచి నాఁడే ప్రయాణసన్నాహములు గావించుకొని విలువగల రత్నములు బంగరునాణెములు సంగ్రహించుకొని తండ్రికిఁ దెలియకుండఁ గుఱ్ఱములెక్కి కాశీమార్గంబునంబడి యరిగిరి. వారు మువ్వురు కొంతదూరము కలిసియే యరిగిరి. కాని యా క్షేత్రములు నలుదెసలం గలుగుటచేఁ బిమ్మట నేకముగా బోవుటకు వీలుపడినది కాదు. మువ్వురు మూఁడు దెసలకుం బోయిరి.

బలభద్రుండు తొలుత వేంకటగిరికరిగి యందుఁ బాపనాశన గోవర్ధనాది తీర్థంబులఁ దీర్థంబాడి వెంకటేశ్వరుని సేవించి యందుఁగల యద్భుత విషయంబుల నెల్ల విమర్శించి యెందును దైవశక్తి యున్నట్లు కనంబడమిఁ దైర్థికుల నిందించుచు నచ్చటనుండి కాంచీపురంబున కరిగెను. అతఁడు కాంచింగల పుణ్యతీర్థంబుల సేవించి వరదరాజస్వామి నర్చించి వైష్ణవులతోఁ దత్ప్రతిపాదములగు ప్రసంగములు గావించి తన మది కించుకయు నమ్మకము జనింపమి నందుండి శ్రీరంగమునకుఁ బోయెను.