పుట:కాశీమజిలీకథలు -04.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండితరాయలకథ

13

ముద్దుబాలుర గోఁతంబెట్టితిని, పితృపవనంబంతయు మెఱకయగుచున్నది. కొడుకులు గలుగనేల, చావనేల? యిప్పుడే యీ గర్భంబు దిగిపోవు నుపాయం బాలోచింపుడు. మీరును నేను సుఖపడుదుమని పలికిన విని యా బ్రాహ్మణుం డిట్లనియె.

తరుణీ? పూర్వకృతము లెట్టివారలకు ననుభవింపక తీఱవుసుమీ? పశుపుత్రగృహక్షేత్రాదులు ఋణానుబంధరూపమునఁ బ్రాప్తించుచుండును. తొలి పుట్టువునం దెట్టి ఘోరకృత్యములఁ గావించితిమో ఇప్పు డనుభవించుచుంటిమి. అంతటితోఁగాక ముందరి జన్మంబులగూడ గష్టంబు లనుభవింపవలయునా? నీవు చెప్పినట్లు చేసితిమేని భ్రూణహత్యాపాతక మనుభవింతుము, తటస్థులమై దుఃఖ మనుభవింపుచుండవలయును. ఇంతకన్నఁ బ్రాణమునకుఁ బ్రతీకారములేదు. సర్వధర్మముల నెఱింగిన నే నధర్మకృత్యంబుల నాచరింతునా? యని బోధించి భార్య నూరడించెను.

ఆనాతి ప్రసూతివేదనకుఁగాక పుత్రశోకం బనుభవింపలేక యెట్లైనఁ దన గర్భమును జెడఁగొట్టుకొను తలంపుతోనుండి చింతింపుచుండగా నొకనాఁడు ప్రాతఃకాలమున యవనసన్యాసి (ఫకీరు) యవనభాషతో దీవెనలం జదువుచు భిక్షార్థమై వారింటికి వచ్చెను.

పలువిధములగు రంగులుగల పూసలపేరు లురమున మెఱయ నల్లని యంగీలందొడగి నీలోష్ణీషముతో నొప్పుచున్న యతనివేషము చూచినవారికి వానియొద్ద నెద్దియో సిద్ధియున్నట్లు తోచకమానదు. వానింజూచి పండితభట్టుభార్య దాసీముఖముగా గర్భస్రావకమగు నోషధి నెద్దియేని నియ్యఁ గలవాయని యడిగినది. ఆ మాటవిని ఫకీరు నోరు గొట్టుకొనుచు అయ్యో? మేము ద్రోహకార్యములు చేయు వారముకాము. మీ యజమానురాలి కట్టియవసర మేటికివచ్చినది? మగనాలికాదాయని యడిగిన నా పరిచారిక వారి వృత్తాంత మంతయు నతనితోఁ జెప్పినది. అప్పుడా ఫకీరు జాలిపడి యా మాట జెప్పకపోతివేమి? మీ యజమానురాలి నిచ్చటికిఁ దీసుకొనిరమ్ము. పరీక్షించి రక్ష రేకిచ్చెదను. ఈసారి తప్పక పుత్రుండు జీవించునని చెప్పిన విని యాదాది సమ్మోదముజెంది యా వృత్తాంతమంతయుఁ బండితభట్టు భార్యకుం జెప్పి యామె నతనియొద్దకు దీసికొనిపోయినది.

అప్పుడా ఫకీరు ఆమెంజూచి యవనమంత్రములతో దీవించుచు అమ్మా! నేను దైవముతోడుగాఁ జెప్పుచున్నాను. నా యిచ్చిన పూసలపేరు సంతతము నడుమునఁ గట్టికొని పుత్రుండు గలిగిన పిమ్మట నా బాలుని మెడయందుంచ వలయును. ఆ పిల్లవానికి ఫకీరని పేరుపెట్టవలయును. రెండుపూటలయందు మసీదునకుఁ దీసికొనిపోయి యందు ( నమాజు ) దైవప్రార్ధన జేయుచున్న యవనవృద్ధులచే దీవెన లిప్పించుచు యవనవేదము (ఖురాన్ ) చెప్పించవలయును. అట్లు జరిగింతురేని మీ పుత్రుఁడు జీవించును. సందియమువలదు. బిచ్చగాని పలుకులని నిరసింపవలదు.