పుట:కాశీమజిలీకథలు -04.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

శకునముజూచి చెప్పుచున్నాను. నా మాటనమ్మి యట్లు చేయుఁడని యెన్నియో శపథముల జేసెను.

ఆ మాటలువిని యా యిల్లాలు మిక్కిలి సంతసించుచు ఫకీరూ? మా కట్టి యదృష్టము పట్టునా? అయ్యో? చల్లనిమాటగాఁ జెప్పితివి. కానిమ్ము. నీ మాట ప్రకారము చేసిచూసెదము. నీ పుణ్యమువలననైన జీవించెనేని నీ శరీరమంతయు బంగారుపూసలపేరులు వేయింతు నిప్పుడు చెప్పనేల నీవును దైవమును బార్థింపు చుండుమని పలుకుచున్నంతలో వీధినుండి పండితభట్టింటికి వచ్చెను.

అప్పుడామె మగనితో ఫకీరు చెప్పిన మాటలన్నియుం జెప్పినది. అతండు నవ్వుచు చాలుచాలు మనమిదివఱకుఁ జేసినవ్రతములు, నియమములు నింత యుపయోగమైనవికద. ఇంక తురకదేవతలా మనల రక్షించువారు ? బిచ్చమునకై యెన్ని యేనియుం జెప్పుదురు వాని సత్యము లని నమ్మవచ్చునా యని పలికిన నక్కలికి వెండియు నిట్లనియె.

నాథా? మన దైవములకన్న తురకదైవములే మంచివారు. ఈ ఫకీరు బిచ్చము నిమిత్తము చెప్పిన మాటలుగాలేవు. ఇప్పుడేమియు నిమ్మని కోరలేదు. పరోపకారపారీణు లన్నికులములలో నున్నవారు. లోకములోఁగూడ నష్టపుత్రు లట్లు చేయుటయు నాచారమున్నదిగదా. దీనం దప్పేమి యట్లు చేసి చూచెదముగాక. మనపుణ్య మెట్లుండెనో యట్లు జరుగును. వీరి మాటలకు నాకుఁ గొంచె మాసగా నున్నదని పలికిన యవ్విప్రుండు కానిమ్ము, నీ యిష్టమువచ్చినట్లు చేయుమని చెప్పెను.

పిమ్మట నమ్మగువయు నా ఫకీరిచ్చిన పూసలపేరు భక్తితోఁ బుచ్చుకొని యతండు వద్దనుచుండ దోసెడు బంగారునాణెము లతని యొడిలోఁబోసి యంపి యా పూసలపేరు పొగవైచి నియమముగా నడుమునకుఁ గట్టుకొని యదిమొదలఁతడు చెప్పినరీతిగా జరుపుచుండెను.

కాలక్రమంబున బండితభట్టుభార్య వాడుకప్రకారము మంచిలగ్నమునఁ గుమారునిం గనినది. ఆ పాపని రూపము తేజము లక్షణములు లగ్నబలమును బరిశీలించి పండితభట్టు హృదయమున జీవించునని యించుక యాసజనింప నాశిశువునకు జాతకర్మాది విధులేమియు సమంత్రముగాఁ గావింపక ఫకీరు చెప్పినరీతిగా జరిగించి యా బాలుని పిన్నఫకీరని పిలువఁజొచ్చెను.

మఱియుఁ బండితభట్టుభార్య ఫకీరిచ్చిన పూసలపేరు తన కుమారుని మెడలో వైచుటయేకాక తురకపిల్లలకుఁబెట్టు నగలును దుస్తులునుబెట్టి యబ్బురముగాఁ బెంచుచుండెను. పిన్నఫకీరు బాలచంద్రుఁడువలె దినదిన ప్రవర్ధమానండగుచుఁ బ్రజ్ఞాగుణరూపములచే నెల్లరకు నద్భుతముఁ గలుగఁ జేయుచుండెను.

ఫకీరు జెప్పిన ప్రకారము పిన్నఫకీరునకు సంవత్సరము దాటిన తరువాత బ్రతిదినము రెండుపూటలయందుఁ బండితభట్టు కాశీపురంబున గల మసీదునకుఁ