పుట:కాశీమజిలీకథలు -04.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

దిరుగాఁ గడుపునఁ బడెనని యెల్లవారుం జెప్పుకొనఁ దొడంగిరి, పండితభట్టు వానికిని జాతకర్మాది క్రియలు నిర్వర్తించి వెనుకటివానిపేరే పెట్టెను. వాఁడు రూపంబుననే కాక విద్యాగ్రహణ సామర్థ్యంబునగూడ సోదరుం బోలియుండెను. తదీయసంభాషణ విలోకనాది విశేషంబులఁ దల్లిదండ్రులు గాలక్షేపము చేయుచు వెనుకటి దుఃఖము మఱచి సంతోషముతో నుండిరి. వానికిని దండ్రి యుపనయనము జేయఁదలంచుచుండు నంతలో నాబాలుండు నకాలమృత్యుదేవతాకరాళజిహ్వాకబళంబయ్యెను. అప్పుడు తల్లిదండ్రులకుఁ గలిగినదుఃఖం బీపాటిది యని నుడువ నాతరముకాదు.

పిమ్మటఁ బ్రాజ్ఞులచేఁ నూరడింపఁబడి వారు వైరాగ్యవృత్తితోఁ గాలక్షేపము జేయుచుండిరి. ఆహా! దైవమద్బుతకల్పనలంజేసి లోకుల సంసారసాగరంబున ముంచుచుండునుగదా. అంతలో వెండియుం బండితభట్టుభార్య గర్భవతియై పుత్రునిం గనియెను. ఆ సమయంబునఁ దల్లిదండ్రులు మృతిదినంబోలె నేడువఁదొడంగిరి. ఆ ద్వనివిని చుట్టుప్రక్కల వారుపోయిచూచి అయ్యా! సంతోషసమయంబున నిట్లు విచారించెదరేల, చెట్టునంబుట్టిన కాయలన్ని యును నిల్చునా? అందఱు నొక్కరీతియే యగుదురా? ఈ ముద్దుబాలుండు చిరకాలము బ్రతుకును. ముఖలక్షణము లట్లున్నవని యూరడించిరి.

వారిమాటలందేరి వారు విచారముడిగి తదనంతర కృత్యములం గావించిరి. ఆ బాలుఁడు దినదినప్రవర్ధమానుండగుచు ముద్దుమాటలచేత జూపులచేతను వారి హృదయము లాకర్షింపుచు వెనుకటి దుఃఖమును మఱుఁపజేసెను. ఈ తేప వీఁడు బ్రతుకునని తల్లి దండ్రుల కాసఁగలిగించుచు నాబాలుఁ డేడేఁడులు పెఱిగి యెనిమిదవ యేఁడు ప్రవేశించినతోడనే కాలధర్మము నొందెను.

ఆ దుఃఖము వారికిఁ బరిపాటియైనదిగావున నప్పుడంతగా బాధింపలేదు. పండితభట్టు పుత్రునివిషయమై నిరాశఁ జేసికొని భార్యకుఁ బోధించి విరక్తుండై కాలము గడుపుచుండ వెండియు నతనిపత్ని యంతర్వత్నియై యథాప్రకారము పుత్రరత్నమునుం గనియెను. వాని మృతప్రాయనింగాఁ దలంచి తల్లిదండ్రులు జాతకర్మాది విధు లేమియుం జరుపక విధిలేక పెనుచుచుండ నా బాలుండు సర్వజనదర్శనీయుండై యేడేఁడులు పెఱిగి పరలోకంబునకరిగెను. ఈరీతిఁ గ్రమంబున బండితభట్టున కేడ్గురు పుత్రులు జనించి యద్భుతకళామనోహరులై యేకప్రాయంబున నుపనయనము సేయకమున్న కాలధర్మము నొందిరి. పుట్టిన పుత్రుండెల్ల నట్లు గిట్టుచుండుటంజూచి పండితభట్టు దానంబులు జపంబులు తర్పణములు హోమంబు లెన్ని యేనిఁ గావించెను. గాని యించుకయు నుపయోగము లేకపోయినది.

ఎనిమిదవ గర్భమునకు నెలదప్పినప్పుడు పండితభట్టుభార్య గోలుగోలున నేడ్చుచు మగనిపైఁ బడి నాథా! యీ ప్రసూతివ్యధ నేను సైరింపకున్న దాననిది నాకు శరీరాయాసమునకేకాక దుఃఖమునకుఁ గూడఁ గారణం బగుచున్నది. ఏడ్గురు