పుట:కాశీమజిలీకథలు -04.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండితరాయలకథ

11

పండితరాయలకథ

కాశీపురంబునఁ బండితభట్టను బ్రాహ్మణుఁడు గలఁడు. అతండు సకలవిద్యలయందు నసమానపాండిత్యము సంపాదించి పెక్కు విద్వత్సభలలో విజయమును గైకొని మహామహోపధ్యాయుం డను బిరుదము వహించెను. మఱియుఁ గాశీపట్టణంబునంగల పండితుల కెల్ల నాతండే ముఖ్యుండై నానాదేశములనుండి వచ్చి చదివెడు విద్యార్థులకుఁ బరిక్షాదికారియై యెక్కుడుకీర్తి సంపాదించెను అతనికిఁ గాశీ సభాపతి యని కూడ వాడుక వచ్చినది. దానంజేసి నిత్యము నప్పురంబునకు వచ్చు తైర్థికులును రాజులును ధనికులును నతని దర్శనము. తప్పకచేసి సన్మానించి యరుగుచుందురు. అందుమూలమున నప్పండితుండు స్వల్పకాలములో వేలకొలది ధనముగలవాఁడై యొప్పెను.

తఱుచు ధనమున్నచోట సంతతి లేకపోవుట వాడుకయున్నది. ఆ విప్రున కట్లుకాక యథాకాలముననే ప్రధమమునఁ బుత్రుండుదయించెను. ఆ శిశురత్న మద్భుతతేజంబునం బ్రకాశింపుచు నెల్లరకు నచ్చెరువు గలుగఁజేసెను. పండితభట్టు ఆ బాలునకు శిశుసంస్కారములఁ గావించి వేలకొలఁది ధనము పంచిపెట్టి విశ్వనాథుం డని నామకరణము వ్రాసెను.

ఆ పండితునింట సంతతము శాస్త్ర ప్రసంగములు జరుగుచుండును గావున నా శిశువు సంస్కృతభాషలోనే మాటలాడఁజొచ్చెను. ఆ విద్వాంసుఁ డాబాలు నైదవయేటఁ జదువవేసి కావ్యనాటకాది గ్రంథములు ప్రారంభించి చెప్పించెను. మిక్కిలి సూక్ష్మబుద్దిగల యా కుమారుండు వ్రతమువలననే గ్రహింపుచు నేడవయేఁడు ముగియు వఱకుఁ దర్కవ్యాకరణములయందుఁ బరిశ్రమ గలుఁగఁ జేసికొనెను. రూపమున మనోహరుండై బాల్యముననే శాస్త్రపరిశ్రమ జేయుచున్న యప్పిల్లవాఁ డెల్లవారి చిత్తంబుల లాగికొనుచుండఁ దల్లిదండ్రుల కోరికలు తీగెలు సాగుచుండెననుట యేమి యబ్బురము?

పండితభట్టు వానికి మిగుల వైభవముతో నుపనయనము జేయఁ బ్రయత్న పడుచున్నంతఁ గృతాంతుండుగూడ బాలుని జూడ వేడుక పడినట్లు నిజభువనాగంతకునిగాఁ జేసికొనియెను. ఆహా! యముండు కృతాకృతముల విచారింపఁడుగదా? సర్వజనమనోహరుండైన యా బాలుని మరణవార్తవిని కాశీపురంబున విచారింపనివారు లేరు. తల్లి దండ్రుల దుఃఖమేమని చెప్పుదును. పండితభట్టు ప్రాజ్ఞుండుగావున నెట్టకే నాశోకం బుపనయించుకొని కొన్ని దినములు చనినవెనుక గ్రమ్మఱి దనయింట యథాప్రకారముగా శాస్త్రపాఠములు జరుపుచుండెను.

పండితభట్టుభార్య సంతతము వానిగుఱించి చింతించుచు విరక్తిగలిగియుండ నింతలోఁ దిరుగా గర్భవతియై యథాకాలమునఁ గుమారునిం గనినది. ఆ శిశు వచ్చు గుద్దినట్లు మొదటివానివలె నొప్పుటంజేసి వాఁడే తల్లిదండ్రుల శోకం బపనయింపఁ