పుట:కాశీమజిలీకథలు -04.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

లభింపదుగదా. కాశీయాత్రవలన మీరు నుడివిన ఫలంబు నాకెట్లు వచ్చునని యడిగిన విని యయ్యతీంద్రుండు గోపా! నీవందులకుఁ జింతింపఁబనిలేదు. పంచములుదక్క తక్కిన జాతులవారందఱు విశ్వేశ్వరమహాలింగమునకు నభిషేకాద్యర్చనలు స్వయముగాఁ జేసికొనవచ్చును. తదభిషేకపుణ్యలాభంబు నీకునుం దప్పక లభింపఁగలదు. అని పలికిన విని యక్కుమారుం డిట్లనియె.

ఆర్యా! దీన నాకొక్కసందియము గలుగుచున్నది. వినుండు. ఒకప్పుడు మా గ్రామములో నేనును మఱికొందఱు గోపాలురును బశువులను మేపుచుండగా సాయంకాలమునఁ బెద్ద గాలివాన వచ్చినది. పాషాణములవలె వడగండ్లు పడినవి. కడవలతో గృమ్మరించునట్లు వర్షము గురియఁదొడగినది గాలివేగ మిట్టిదని చెప్పలేను. అట్టి సమయమున మేమందఱము పశువులను విడిచి గ్రామాభిముఖముగాఁ బరుగిడి పోయితిమి. వానతాకుడు బలమగుటచే వితాకుపడి యూరిబయటనున్న శివాలయము తలుపులు తెఱచుకొని దానిలో దూరితిమి. ఆ దివసమున నర్చకుండు మా పుణ్యవశమునఁ తాళమువైచుట మఱచెనఁట.

ఆ గుడిలోఁ బెద్దదీపము వెలుగుచున్నది . లింగముదాపున నరటిపండ్లు టెంకాయముక్కలు లోనగుపదార్ధము లున్నవి. గాలి యించుకయేని లోనికి సొరమింజేసి వెచ్చగా నున్నది. మేము మిగుల సంతసించి తడిగోచు లూడఁబారవైచి యా ఫలము లన్నియుం దిని యాకలి యడంచుకొని యా స్వామిదయచే దెల్లవారు వఱకు హాయిగాఁ బరుండి నిద్రపోయితిమి.

అంతలో నర్చకుండు తాళముమాట జ్ఞాపకమువచ్చి తెల్లవాఱక పూర్వమే యా గుడికి వచ్చెను. మే మందు నిద్రబోవుచుంటిమి. మమ్ము దొంగలగా భావించి వేగముపోయి గ్రామస్థుల దీసికొనివచ్చెను. వారు మమ్ము లేపి మావలన యథార్ధము తెలిసికొని దండించి విడిచి పెట్టిరి.

మే మాగుడిలో దూరి లింగము సోకినందులకు నాలుగు దినంబులు నైవేద్యము మానిపించి పిమ్మట నా ప్రాంతమందలి పెద్ద పెద్ద బాపనయ్యల రప్పించి మూడుదినంబులు మత్రంబులం జదువుచు సంప్రోక్షణ చేసి సంతర్పణఁ గావించిరి.

అయ్యా! పల్లెటూరి గుడిలింగమునకే యింతనియమము గలిగి యుండఁ ద్రిభువనప్రసిద్ధింబగు విశ్వేశ్వరలింగమున కట్టినియమ మేమిటికిలేదు; దీనికెద్దియో కారణముండకపోవదు; తద్వృత్తాంతము వక్కాణింపుఁ డని యడిగిన విని యయ్యతీంద్రుం డవ్విషయముదనకునుఁ దెలియనిదగుటచే నమ్మణిని మ్రోలనిడికొని కన్నులు మూసి యించుకధ్యానించి తద్వృత్తాంతమంతయు నంతఃకరణగోచరము చేసికొనియెను.

అప్పు డత్తావసచంద్రుఁడు మందహాసము చేయుచు గోపా! నీ పుణ్యము మంచిది. దీన మంచికథ వినుట తటస్థించినది. నీ ప్రశ్న మూరక బోవునా వినుమని యక్కథ నిట్లు చెప్పఁదొడంగెను.