పుట:కాశీమజిలీకథలు -04.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శుభమస్తు – అవిఘ్నమస్తు

కాశీమజిలీ కథలు

నాలుగవ భాగము

ముప్పది నాల్గవ మజిలీ

క. శ్రీమణిసిద్ధ యతీంద్ర
   స్వామి సమీహితమనీష చాత్రసమేతుం
   డై ముప్పది నాల్గవమజి
   లీ ముదమునఁ జేరి యట జలింపని భక్తిన్.

వ. ప్రణవమంత్ర పరాయణ పారాయణుండై జపావసాన సమయంబున నాఁ డుపవాసదినం బగుటఁ దీఱికగాఁ గూర్చుండి యంతకు మున్ను వింతలంజూడ నరిగిన గోపకుమారుని రాక నరయుచుండెను.

అంతలో నాగోపాలుం డా గ్రామము నలుమూలలు దిరిగినాఁడు. తన కేదియు వింతగ గనబడమిఁ బరితపించుచు గురు నంతికమునకు వచ్చి నమస్కరించి స్వామీ, మనమిల్లు వెడలిన తరువాత నింతపాడు మజిలీ యెందునులేదు. ఈ గ్రామముకన్న నరణ్యమే మేలు. గ్రామ మంతయుఁ బదిసారులు తిరిగితిని. మి మ్మడగుట కెచ్చట నేవిశేషము గనంబడలేదు. పోనిండు. ఇది పుణ్యదినము. ఊరక కాలహరణము చేయనేల ? కాశీవిశేషంబులఁ చెప్పి నన్ను గతార్థుం జేయుఁడని ప్రార్థించెను.

అప్పు డయ్యతిపుంగవుండు సంతసించుచు వానికి విశ్వేశ్వరమహాత్మ్యము, అభిషేకప్రభావము, పూజామహిమ లోనగు విశేషములన్నియు నితిహాసపూర్వకంగా వక్కాణించెను. వాఁడు తత్ఫలం బాలించి మించిన వేడుకతో స్వామీ, నేను నీచకులంబునఁ బుట్టినను మీయట్టి మహానుభావుని సాంగత్యము దొరకుటవలన కాశీయాత్ర లభించుచున్నది. కావున విశ్వేశ్వరుని నర్చించు భాగ్యం నాకీజన్మమున