పుట:కాశీమజిలీకథలు -04.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మేము వింటిమి. వానివలన నిశ్చయింప శక్యము కాకున్నది. మా యెదుట నిశ్చయము గలుగునట్లు భగవంతుడు వచ్చి చెప్పవలయును.

శైవులు - చిత్తము చిత్తము. శంకరాచార్యస్వాములవారు మధ్యార్జునములో వాదము వచ్చినప్పుడు లింగముఖముగా శివుఁ డెక్కుడు దైవమని పలికించెను

వైష్ణ - (లేచి) అబద్ధము అది యబద్ధము మీ యొద్దబొంకుచున్నారు. ఆ తగవు ద్వైతాద్వైతమతములఁ గుఱించి వచ్చినది. సత్య మద్వైతమని చెప్పినట్లు గ్రంధములో వ్రాయబడియున్నది.

రాజ - మీ యవివేకము వింతగా నున్నది. మే మెన్నిసారులు చెప్పినను వెనుకటి గొడవలే చెప్పెదరు. మీలో నొక్కరికైనఁ బ్రత్యక్షమైన విషయమున్న దియా? సరియైన యుత్తరము చెప్పనచో దూరముగాఁ ద్రోయుంతుము జుఁడీ ?

శైవు - చిత్తము చిత్తము. దివ్యక్షేత్రములలో నట్టిమహిమ గనంబడును గాని యిక్కడ నేమియుం గనంబడదు అదియే నిశ్చయము.

రాజ — మీకు దివ్యక్షేత్రము లేవి ?

శైవులు — కాశీ రామేశ్వర శ్రీశైల కాంచీ కేదారాదులు మహామహిమగల క్షేత్రములు. అచ్చటికిఁ బోయిన బెక్కునిదర్శనములు గనంబడును.

రాజ — సరియే. దూరముగాఁ గూర్చుండుఁడు. మాకు మీ మత మంగీకారము కాదు.

వైష్ణవులు – ఈ లాగున దయచేయుడు మనమందఱము నొకచోటనే కూర్చుందము. ఇక శాక్తేయులున్నారు.

శైవులు — వారుమాత్రముగా ప్రత్యక్షముఁ జూపగలరా యేమి? విచారింపనక్కరలేదు. క్షణకాలములో వారును మనయొద్దకే వచ్చి కూర్చుండెదరు. అని కూర్చుండిరి.

రాజ — శాక్తేయ లెచ్చట?

శా - (లేచి) ఇదిగో మేము. మేము.

శ్లో॥ తస్యాస్సేవానిరతమసాం, అని చదువుచుండ,

రాజ - (వారించుచు) అనవసర ప్రసంగము జేయవలదు. శ్లోకములు గ్రంథములు మాకుఁ బనికిరావు. శక్తి ప్రధానురాలైనట్లు ప్రత్యక్షముఁ జూపవలయును. వెనుకటి గాథల నమ్మము.

శా - నమ్మకున్న నెట్లు? అందఱివలెనే శక్తినికూడఁ దీసివేయుదురా యేమి? పూర్వము శంకరాచార్యులు శక్తిమతము నిరసించువఱకు నామె యతనిఁ బెక్కుచిక్కులను పెట్టినది.