పుట:కాశీమజిలీకథలు -04.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అప్పుడా రాజపుత్రులు పరమభక్తితో బండ్లుదిగి యాలయము లోనికిం బోయిరి. అందున్న వైఖానసులు రాజపుత్రుల నెదుర్కొని యుచితసత్కారములతోఁ బ్రదక్షిణనమస్కార ఘంటానాదములఁ జేయించి స్వామి లోనియాలయమునకుఁ దీసికొనిపోయి భగవద్దర్శనము చేయించిరి. శంఖచక్రగదాధరుండైన శ్రీవిష్ణుదేవుని విగ్రహముఁ జూచి రాజపుత్రులు నమస్కరించుచు ఆర్యులారా! మనల సృష్టించిన భగవంతుఁ డితఁడా ? ఇందుండి జగమ్ములన్నియు రక్షించుచుండునా?" యని యడిగిన వైఖానసు లిట్లనిరి. "అయ్య! విష్ణుండు సర్వలోకవ్యాపకుండు. జగద్రక్షకుండు భక్తపరాధీనుండు. సర్వజనసేవ్యుండు. సర్వదేవోత్తముండు. ఇంతకన్న వేఱొకదైవము లేఁడని శ్రుతులు ఘోషించుచున్నవి. కావున మీరీస్వామి నారాధించుచుండుఁడు. కామితములు సిద్ధించు" నని తత్ప్రతిపాదకములైన శ్లోకములు చదివి వారి చిత్తములకు సంతోషముఁ గలుగఁజేసిరి. అంతలో సాయంకాల మగుటయు నాదినమున విహారము మాని వారు నివాసదేశమునకుం జనిరి. మఱునాఁడు వారు క్రమ్మఱ విహరించుచున్న సమయంబున మఱియొక వీథి శివాలయము సమున్నతగోపురప్రాకారమంటపాదులచే నొప్పుచు వారికిఁ గనంబడినది. దానింజూచి బలభద్రుఁడు “ఓహో! ఇది యేమి? మేము నిన్న వచ్చినవీథికే దీసికొని వచ్చితిరే! నిన్నటి యాలయము కనబడుచున్న" దని యడిగిన సహాయులు "అప్పలారా! ఇది నిన్నటి వీథికాదు. మఱియొకవీథి. ఇది శివాలయము. ఇందు జగద్రక్షకుఁడైన మహేశ్వరు డున్నవాఁడు విష్ణునివలె నీ స్వామిని ప్రజలు సేవించుచుందు" రని చెప్పిరి.

ఆ మాటలు విని వారు వెరఁగుపడుచు శకటంబులదిగి లోనికిం బోయిరి. అందున్న శైవులా వార్తవిని యెదురుకు వచ్చి రాజపుత్రులచే బ్రదక్షిణనమస్కారముల చేయించి గర్భాలయములోనికిఁ దీసికొనిపోయి “అయ్యా! సర్వలోకేశ్వరుఁడైన మహేశ్వరుం డిందున్నవాఁడుఁ ఈతఁడే మనల సృష్టించి రక్షించువాఁడు ఈతనికే మహేశ్వరుఁడని పేరునున్నది. ఇతర దైవముల కీనామము లేదు. ఇతండు భక్తపరాధీనుండు సులభలభ్యుండు సర్వదేవోత్తముఁడని శ్రుతులు ఘోషించుచున్నవి. కావున మీ రీమహానుభావు నర్చించిన గృతకృతు లగుదురని చెప్పిరి. ఆ మాటలు విని బలభద్రుండు తమ్ముని మొగము జూచి "అయ్యో! ఇది యేమి? వీరి మాటలు వింతగనున్నయవి. మనల సృష్టించినవాఁడు విష్ణుదేవుండని నిన్న వారు చెప్పిరిగదా? ఇప్పుడు వీ రిట్లు చెప్పుచున్నా రేమి? దీనిలో నేది నిశ్చయమో తెలిసికొనవలయు" నని పలుకుచుండగా విని శైవులు అయ్యా ! వినుండు. మీరు మిగుల బుద్దిమంతులు. మేము శివుఁడు సర్వోత్కృష్టుఁడని పెక్కుదృష్టాంతములు జూఁపగలము. వేదమంతయు శివపరముగానే యున్నది. విష్ణుండు శివునికి భక్తుడు ఆ మాట కప్పిపుచ్చి విష్ణువులు మీతో నతండే సర్వోత్తముఁడని చెప్పిరి కాఁబోలు. ఆమాటలు నమ్మకుఁడు. బదునెనిమిది మహాపురాణములలోఁ బదునొకండు పురాణములు శివమయ మనిఁ జెప్పిన