పుట:కాశీమజిలీకథలు -04.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహామాయ కథ

79

యని బుధవర్మ యొకనాఁడు విద్యామందిరమునకుంజని పండితులచేఁ పరీక్షింపజేసెను. పండితులు పరీక్షించి తదీయవిద్యాపరిశ్రమమున కచ్చెరవందుచు రాజుతో “దేవా ! నీ పుత్రులును బుత్రికయు సకల విద్యలయం దారితీఱిన పాండిత్యము గలవారైరి. కాని లోక వాసనయేమియుం దెలయకపోవుట యించుక కొఱంతగా నున్నది. తోఁటకూర యని పలికెడు రామచిలుక తద్వస్తువును గురుతెఱుంగనట్లు వీరికి లోకానుభవ మేమియునులేదు. అదియే తీఱుపవలయునని వక్కాణించిరి. బుధవర్మ బిడ్డల నంతటితో విద్యాపరిశ్రమము మానిపించి ప్రతిదినము సాయంకాలమున నశ్వశకటముమీద బట్టణవీథులవెంబడిఁ దిరిగి యచ్చట విశేషముల గ్రహించునట్లు నియమించెను. అయాయీ విశేషములం దెలుప సమర్దులగు వ్యవహార వేదులఁగూడఁ దోడనంపుచుండెను. అది మొదలు రాజపుత్రులు జెలియలతోఁగూడఁ బ్రతిదినము సాయంకాలము గుఱ్ఱపుబండ్లెక్కి రాజవీధులం దిరుగుచుండిరి. వారికిఁ గనంబడిన విషయమెల్ల వింతగానే దోఁచుచుండెను. వారు విపణిమార్గంబునఁ బోవునప్పుడు బహువిధవ్యాపారములఁ జేయు వర్తకులంజూచి వీరెవ్వరు? ఈ వస్తువులెల్ల నెల్లరకు నిచ్చుచున్నారే? మంచిపుణ్యాత్ములవలెఁ దోచుచున్నారని యడిగిన సహాయు లిట్లనిరి.

'అప్పలారా! వీరు వర్తకులు నానాదేశములనుండి సరకులం దీసికొనివచ్చి యెక్కుడువెలకు నిక్కడ విక్రయించుచుందురు. దాని వలన విశేషలాభము వచ్చును. ధనికులై వస్తువాహనముల సమృద్ధముగా సంపాదించి సుఖించుచుందురు. యిదియే వీరి వృత్తాంతమని చెప్పిరి.

ఆ మాటల విని వారు 'ఇసిరో! ఇదియా వీరి వ్యాపారము స్వలాభమునకై పాటుపడుట సద్వ్యాపారము కానేరదు. పరోపకారపారీణు లనుకొంటిమే చాలుఁజాలు. మఱియొక విశేషము చూపుఁడని యచ్చటనుండి మఱికొంత దూరము నడచిరి. అచ్చటి వారి వృత్తములు చూచినను నట్లేయున్నవి. విపణి వీథియంతయుం దిరిగి యందలి జనుల వృత్తము లన్నియుఁ బరీక్షించి యడిగి యేకరీతిగా నుండుట విచారించి వారు మెచ్చుకొనక "యీ వీథి మంచిదికాదు. ఇందుఁబుణ్యాత్ము లెవ్వరును లేరు. మఱియొక వీథికి దీసికొనిపొండని" సహాయులఁ గోరికొనిరి. రెండవవీథిని నడుచునప్పు డొకచో విష్ణ్వాలయము కనంబడినది. అందలి గోపురమంటప ప్రాకారాదులు మనంబుల కచ్చెరువు గలుగుఁజేయ రాజపుత్రులు బండ్లనిలిపించి సహాయులతో శిలానిర్మితములైన యీ గృహవిశేషము లెవ్వరివి? మిక్కిలి యెత్తుగల యీముందరి మండపమందు జనులెవ్వరు నున్నట్ల కనంబడరేమి? లోపలి గృహము సైతము క్రొత్తతీరుగా నున్నది. దీని వృత్తాంతము చెప్పుఁడని యడిగిన సహాయ లిట్లనిరి. అయ్యా! ఇది విష్ణ్వాలయము. ఇందు మనల సృష్టించిన భగవంతుఁడు నివసించి యున్నాడు. ముందరిదానినే గోపురమని వాడుదురు. దానియవ్వలిది ధ్వజస్థంభము. ఆ వైపుది కళ్యాణమంటప మని యావిశేషము లన్నియుం జెప్పిరి.