పుట:కాశీమజిలీకథలు -04.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మాకేమియుం దెలియదని చెప్పిరి. మీకుఁగాకఁ యొరులకుఁ జెప్ప శక్యమా యని యూహించి వడిగా వచ్చితిని. దీనివృత్తాంతము విన నెవ్వరికిఁ గోరికయుండదు? వేగమ వాక్రుచ్చి నాకు సంతసము గలుగఁజేయుఁడని ప్రార్ధించిన నాపారికాంక్షి తన మణివిశేషముచేఁ దదుదంత మంతయు నాకలించుకొని వాఁడు భుజించినవెనుక సావకాశముగాఁ గూర్చుండి యాకథ యిట్లు చెప్పదొడంగెను.

మహామాయ కథ

దేవదుర్గమను పట్టణంబున బుధవర్మ యనురాజు కీర్తిమతియను భార్యతోఁ గూడి ప్రజలంబాలించుచుండెను. అతండు ధర్మశీలుండు దయాళుండును సత్యసంధుఁడును బరాక్రమశాలియు నగుటచేఁ బ్రజలతనియందు బద్ధాధరులై తండ్రింబోలెఁ జూచుకొనుచుండిరి. ఆనృపాలునకు సంతతి కలుగుట కించుక యెడమగుటయుఁ బ్రజలెల్ల తల్లడిల్లి తమతమ యభీష్టదేవతల నారాధించుచు వ్రతములం జేయుచు నియమములు బూనుచు యాత్రలుగాంచుచు పెక్కుతెరంగుల బరితపించుచుండిరి. దైవయోగంబున నన్నరపతికిఁ గాలక్రమంబున వరుసగా నిరువురుపుత్రులును నొకపుత్రికయుం జనించిరి. అప్పుడా యెకిమీఁడేకాక యాదేశప్రజలెల్లఁ బరమానందసాగరంబున మునింగిరి. భూపతియుఁ దనయపత్యమునకు యథాకాలమున జాతకర్మాది విద్యుక్తక్రియలు నిర్వర్తించి పెద్దవానికి బలభద్రుండనియు రెండవవానికిఁ గృష్ణుండనియు నాఁడుపిల్లకు సుభద్రయనియు నామకరణములు చేసెను. ఆమువ్వురకు సంవత్సరము హెచ్చుతగ్గు కలిగియున్నను నైదేండులుప్రాయము వచ్చువరకు వారు ముగ్గురు నొక్క ఈడు గలవారివలెనే గనంబడుచుండిరి. బాల్యంబున వారి మొగంబులును జూపులును మాటలును జూచిన నెట్టివిరక్తుల కైన ననురాగము గలుగకమానదు. సాముద్రికశాస్త్రలక్షితులై సర్వావయవసుందరులై యద్భుతతేజఃపరిపూర్ణులగు నాబాలురపోలికలు సమముగా నుండుటచే నిత్యముఁ జూచువారికే గుఱతుపట్టుట కష్టముగా నుండునది. ఆకారలక్షణతేజోవిశేషములఁ దుల్యులగు తనపిల్లలంజూచి బుధవర్మ మిగుల సంతసించుచు వారి కైదవయేఁడు ప్రవేశించినది మొదలు లోకవిషయంబుల నేమియుఁ జూడనీయక విద్యామందిర మొకటి కట్టించి యందు వారినిఁ బ్రవేశపెట్టి పలువురు నుపాధ్యాయుల నియమించి కేవలము విద్యాప్రసక్తియేకాని యితరవిషయము లేమియుఁ జెప్పవలదని వారిని బోధించి విద్య నేర్పింపఁ దొడంగెను.

ఆ గురువులును తమకు నియమితమగు కాలంబున నియమింపబడిన విద్య నేరుపుచుండిరి. ఆ రాచబిడ్డలు నితరవ్యాసంగముల నెఱుంగక గురువులనుండి. సమస్తవిద్యలను సక్రమముగా గ్రహించిరి. పదియాఱేఁడుల ప్రాయమువచ్చువరకు వారు శాస్త్రములయందును, ధనుర్వేదమునందును, జిత్రలేఖనమందును, గణితమునందును నసమానమైన పాండిత్యము సంపాదించిరి. పుత్రుల విద్యాగ్రహణసామర్థ్య మెట్లున్నదో