పుట:కాశీమజిలీకథలు -04.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఱాతిమందసము కథ

77

జన్ముండని నిశ్చయించి విరక్తులై యద్వైతతత్వబోధామృతంబుఁ గ్రోలుచు దపోవనంబున కరిగిరి. గంగానదిని మునింగి పండితరాయలు భార్యతోఁగూడ మనుష్యశరీరమును విడిచి యథాపూర్వకముగా దివ్యదేహము ధరించి పరమానందము నొందెను. గోపా! ఇదియే వారి వృత్తాంతము. మనకుఁ బయనపు సమయమగుచున్నది. లెమ్మనిపలికిన వాఁడు చేతులు జోడించి మహాత్మా! మీ కటాక్షమున మంచికథ వింటిఁ గృతార్దుండనైతి. చివర వారు యథాపూర్వకముగా దివ్యదేహములు ధరించిరని చెప్పితిని. దీనం బ్రశ్నావకాశము గలుగుచున్నది. వారు పూర్వ మెవ్వరు? అట్లు జనింప నేమిటికి? ఆవృత్తాంతముఁ జెప్పుడని వేఁడికొనిన నయ్యతి నవ్వుచు నిట్లనియె "ఓరీ! నేను మఱచిపోయి యిట్లంటి దీని కొకకారణము లే దని పలికెను. కాని యంతమాత్రమున వాఁడు విడువక యా సిద్ధుని యడుగులం బట్టుకొని వేఁడుకొనిన నతం డిప్పుడు చెప్పుటకు వీలులేదు. ముందు శివాలయము కనంబడినచోట జ్ఞాపకము చేయుము దాని కట్టి కారణమున్నదని చెప్పి వాని నొప్పించి పిమ్మట బయనంబై శిష్యునితోఁ గూడఁ దరువాత మజిలీ చేరెను.

ముప్పదియేడవ మజిలీ.

ఱాతిమందసము కథ

ముప్పదియేడవ యవసధము సాధారణమైనగ్రామము. అందు వాడుక ప్రకారము గురుండు నియమచిత్తుండై జపమునకుఁ గూర్చున్న సమయమున శిష్యుఁడు వింతలంజూడ గ్రామములోనికిం బోయి నలుమూలలఁ దిరిగితిరిగి యేదియుం గనంబడమి విసిగికొనుచుఁ బ్రాంతారణ్యభాగమునకుం జని యరయనరయ నొకచో నొకవింత గనంబడుటయుఁ గడురయంబున నయ్యవారియొద్ద కరిగెను. అయ్యతియు భోజనాదికృత్యములు నిర్వర్తించి వానిరాక నిరీక్షించియుంటంజేసి వానిం గాంచి రమ్ము రమ్ము. నీమొగమ్ముఁ జూడ వేడుకపడుచున్నట్లున్నది. ప్రొద్దుపోయినది. కుడిచిన పిమ్మట నడిగెదుగాని యని పలికిన విని స్వామీ! యాలస్యమైనచోఁ జెప్ప మఱచెదను. వినుండు. ఇదియు వెనుకటి మజలీవంటిదే ఇందేవింతయుఁ గనంబడలేదు. ఊరువిడిచి యడవికిం పోయితిని. అందొక యద్భుతమైన ఱాతిమందసము గనంబడినది అది తెల్లని పాలశిలతోఁ జేయబడినది. నూఱుగజముల పొడవును నలవది గజముల యెత్తును నేబది గజముల వెడల్పును గలిగి చతురస్రమై యొప్పుచున్న యాశిలాపేటికపై కెక్కుటకు యాసోపానము లెవ్వరో వింతగా నేర్పఱచిరి. పైకెక్కి చూచితిని మూఁత వేయఁబడి యున్నది. ఒకచోట రంధ్రము పడినది. కావున దానివెంబడిఁ జూచిన బాతాళబిలమువలెఁ గనంబడును. వేగురైనను దానిమూఁతఁ గదల్పఁజాలరు. పోలికంబట్టి యది మందసమని యూహింపబడుచున్నది. ఆపెట్టె వాడెడువా రెవ్వరో? ఎంతబలముగలవారో? ఎంతదేహము గలవారోగదా? దాని వృత్తాంత మడిగిన నచ్చటివారు పెద్దకాలమునుండి యిట్లేయున్నది.