పుట:కాశీమజిలీకథలు -04.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చుచు గంగాతీరమున మణికర్ణికాఘట్టమునకుం జని గంగ కభిముఖముగా నిలువంబడి యంజలిపట్టి, కన్ను లర మూసి యమ్మహాదేవి నిట్లు ధ్యానించెను.

శ్లో॥ సమృద్ధ సౌభాగ్యం సకలవసుధాయాః కిమపిత
     న్మహైశ్వర్యంలీలా జనిత జగతః ఖండపరశోః
     శ్రుతీనాం సర్వస్వం సుకృత మథమూర్తం సుమనసాం
     సుధాసౌందర్యంతే సలిలమశివం నశ్శమయతు.

శ్లో॥ ప్రభాతే స్నాతీనాం నృపతి రమణీనాం కుచతటీ
     గతో యావన్మాత ర్మిలతి తవతోయైర్మృగమదః
     మృగాస్తావద్వైమానిక శతసహస్రైః పరివృతా
     విశంతి స్వచ్ఛందం విమలవపుష్ణో నందనవనమ్.

శ్లో॥ తవాలంబాదంబ స్పురదలఘు గర్వేణ సహసా
     మయాసర్వేవజ్ఞా సరణి మధనీ తాన్సురగణా
     ఇదానీ మౌదాస్యం భజసియది భాగీరధితదా
     నిరాధారోహా రోదిమికధయ కేషామిహపురః

ఓ తల్లీ ! భూమండలమునకెల్ల సమృద్ధమగు సౌభాగ్యమై జగత్తుల నిర్మించు నీశునకు మహైశ్వర్యమై శత్రులుయొక్క ధనమై వేల్పుల సుకృతస్వరూపమై సుధాధవళమై యొప్పు నీతోయము నీ పాపము నశింపఁజేయుఁగాత.

రాజస్త్రీలు కుచతటంబులఁ గస్తూరి రాచికొని నీ జలంబుల మునుంగునంత వారినేకాక కస్తూరీమృగ సంతతులఁగూడ విమాన మెక్కించి స్వర్గవాసులఁ జేయుచుందువు. తల్లీ! నీ మహిమ యేమని కొనియాడుదును.

అంబా! నేను నీయాలంబనము జూచికొని దేహమున భూదేవతలఁగూడ నతిగర్వముతోఁ దిరస్కరించితి. ఇప్పుడు పరీక్ష సమయము వచ్చినది. ఇప్పుడు నీవు నా విషయమై యుదాసీనభావము వహించితివివేని భాగీరథీ! నిరాధారుఁడనై యెవ్వరి కడకుఁ బోయి మొరబెట్టికొందును. నీవు నన్నిప్పుడు రక్షింపక తప్పదు.

ఈ రీతి నరువది శ్లోకములు రచించెను. ఆ శ్లోకములకే గంగాలహరియని పేరు. పండితరాయలు భక్తివివశుఁడై యొక్కొక్కశ్లోకము రచించుచుండ గంగానది యుప్పొంగుచు నొక్కొక్కసోపాన మాక్రమింపఁజొచ్చినది. అరువది శ్లోకములు పూర్తియైన తోడనే యామెట్లన్నియుఁ గ్రమంబున ముంచికొనివచ్చి భాగీరథి యా దంపతులు నిలింపులు కుసుమవర్షంబులు గురియింప నాత్మాయత్తముఁ జేసికొని యెప్పటియట్ల ప్రవహింపఁ దొడఁగినది. అందున్న వారెల్ల నావింతఁ గన్నులారఁ జూచి యాశ్చర్యసాగరనిమగ్నులై పండితరాయల ప్రభావముఁ బలు తెఱంగుల స్తుతియింపఁజొచ్చిరి. అతని తలిదండ్రులు పెద్దతడవు చింతించుచు నతండు కారణ