పుట:కాశీమజిలీకథలు -04.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండితరాయలకథ

75

లేకున్నది. నీ వీతురకపడఁతి నేమిటికిఁ మొదట బెండ్లి యాడితివి. బ్రాహ్మణులలోఁ గన్యలు లేకపోయిరా? అయ్యో! యువతి దేవాలయములోఁ బ్రవేసించునని యెంత సన్నాహముఁ గావించితివి. ఆ నియమ మంతయు నేమయ్యెను. అన్నన్నా? మీ తండ్రి కేమిగతిఁ జూపితివని యనేక ప్రకారములఁ బలవరించుచున్న తల్లిని మెల్లఁగ నంతఃపురమునకుఁ దీసికొనిపోయి గద్దియం గూర్చుండబెట్టి యోదార్చుచు నిట్లనియె.

అమ్మా! ఈసంసార మతిగహనమైనది. జంతువు కర్మసూత్రమునఁ గ్రుచ్చఁబడుననే దాని వెంబడిని పోవుచుండును. జనుండు స్వతంత్రుఁడు కాఁడు అని శాస్త్రములు ఘోషించుచున్నవి గదా! ఈ రమణి బ్రాహ్మణయువతి కాని యవనాని కాదు. కారణాంతరమున నట్టిప్రతీతిఁ బొందినది. అదియునుంగాక సుకృతదుష్కృతములకు మనసే ప్రధానము నామన సన్నిటిని రోసి నిస్సంగమైయున్నది. వినుము

శో॥ తదయం కరోతు హయమేధ శతాస్య మితాని విప్రహననాస్యధనా॥
     పరమార్థవిన్న సుకృతైరపి దుష్కృతైరపి లిప్యతేస్తమిత కర్తృతయా॥

పరమార్ధమును దెలిసినవాఁ డశ్వమేధము లనేకములు చేయుఁ గాక యనేక విప్రహత్యలు చేయుఁగాక ఆ పుణ్యము నీ పాపమును గూడ నంటదు కర్తృత్వ మతనికి లేకపోవుటయే దీనికి హేతువు. తల్లీ! ఏను నట్టివాఁడనే. ఇందు గుఱించి మీరు చింతింపవలసిన పని లేదని పలుకు చుండఁగనే యచ్చోటికిఁ బండితభట్టు వచ్చెను.

తండ్రిని జూచి కుమారుండు భార్యతో లేచి యతనికిసాష్టాంగ నమస్కారములుగావించి యుచితాసనాసీనుంగావించి యేమియుం బలుకక యోరగాఁ గూర్చుండెను. అప్పుడు తండ్రి వాని వైభమంతయుం జూచి తలపంకించుచు నిట్లనియె "వత్సా! నీ వనార్యుండవై సంపదల కాసించి యుభయలోకములకుం జెడితివి నీకతంబున మేమునుం జెడితిమి. నీ విద్యాలాభ మీరీతిం బరిణమించినది కదా ఇప్పుడు కాశీపండితులు నీతో మాటాడినంతనే నాకు వెలియవేయుదుమని చెప్పిరి. కన్నకడుపు కావున నూరకొన లేక రహస్యముగాఁ జూడవచ్చితిమి. మా కిట్టిగతిఁ గల్పన చేసితివి మంచిపుత్రుండ వౌదు" వని కన్నీరుఁ గార్చుచున్న తండ్రి కతండు తగురీతి సమాధానముఁ జెప్పి వెండియు నిట్లనియె. తండ్రీ ! పెక్కు లేమిటికి. రేపు ప్రాతఃకాలంబున నీయూరి పండితులనెల్ల మణికర్ణికాఘట్టంబునకు రప్పింపుము నే నక్కడికి వచ్చి నే నపవిత్రుండనో పవిత్రుండనో గంగామహాదేవిని సాక్షిణిగాఁ గోరికొనియెదను. ఆమె న న్నపవిత్రుంగా జెప్పెనేని మీరనిన ప్రాయశ్చిత్తమునకు బాధ్యుండను. ఇప్పు డిదియే కర్జమని బలికిన సంతసించుచుఁ బండితభట్టు భార్యతోఁగూడ నింటికి జని మఱునాడు గాశీలో నున్న పండితులకెల్ల నా తెఱంగెఱింగించి యచ్చోటికిఁ దీసికొని వచ్చెను. అందరిలోఁ బండితరాయలు లవంగితోఁ గూడఁ జుట్టును బెక్కండ్రు సేవకులు సేవింప విశ్వేశ్వరుం దర్శనము సేసికొని యమ్మహాత్ము ననేకస్తోత్రములు గావిం