పుట:కాశీమజిలీకథలు -04.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అని అనేకప్రకారములం బార్ధించిన మృదుహృదయుండగు పండితరాయ లేమియుఁ బలుక లేక యూరకొనియెను.

అప్పుడే చక్రవర్తి దౌహిత్రు నెత్తుకొని ముద్దాడుచు నందలముల నందఱ నెక్కించి యధికవైభవముతో ఢిల్లీ పురమునకుఁ దీసికొని యాపూర్వ సత్కార్యములం గావించెను. పండితరాయలు లవంగిం గలసికొని పుత్రు నందిచ్చి యధికసంతోషముతో జరిగిన వృత్తాంత మంతయు జెప్పుచుఁ బడినయిడుముల, నుడువుచు నామెచేసిన పనుల నడుగుచుఁ గుందలతిలకయు సంగీతచంద్రికయు జేసిన సహాయములఁ బొగడుచుఁ పదిదినము లొక్కగడియలాగున వెళ్ళించెను.

అప్పుడు కాశీపురవాస్తవ్యుండైన పండితభట్టుగారి కుమారుఁడు పండితరాయలు పాదుషాగారి కూఁతురు లవంగిం బెండ్లి యాడి యామెవలన సంతానమునుగని కులము చెఱుపుకొనియెను. అను వార్త దేశమంతము వ్యాపించినది. ముఖాముఖిగా నా సంగతిఁ గాశీలోనున్న పండితభట్టు విని భార్యతో గూఁడ మిక్కిలి పరితపించుచు నతనిఁ జూడ డిల్లీ రాజధానికి బయనంబయ్యెను. అప్పుడందుఁగల పండితు లతని నాక్షేపించుచు సీ? వాఁడు నీకెక్కడి కొమరుండు. మంచి వంశముఁ బాడుచేసి కామాతురుండై తురక నెలంతుకను బెండ్లియాడెను. అట్టివాని నీ వెట్లు చూడఁబోయెదవు నీకున్న ఖ్యాతికిఁ గళంకము కాదా? యెందరు నీకు బుద్ది చెప్పగానే వచ్చినది. ఆ యుద్దములో నితనిఁ జక్రవర్తి కూతురు మోహించినది. ఆ మాయలోఁ బడిపోయెను. చదివిన చదువంతయు నీటిపాలు చేసెను. వీనిని జచ్చినవారితో నెన్నుకొనుమని యెన్నియో నీతులు చెప్పి పోవనిచ్చిరుకారు. పండితభట్టు చిత్తముఁ ద్రిప్పుకొనియెను. కాని యతని భార్య మాత్రముఁ గుందుచు నెట్లయిన గొమరునిఁ జూడవలయునని యతనికి నుత్తరము వ్రాసి పంపినది ఆ యుత్తరము జూచుకొని పండితరాయలు మిక్కిలి పరితపించుచు నప్పుడే కాశీపురికిఁ బయనంబయ్యెను. అతనితో లవంగియు బయలు వెడలినది. పుత్రుని మాత్రము చక్రవర్తి యొద్ద నునిచిరి.

పండితరాయలు సకలపరివారములతోఁ జతురంగబలము సేవింపఁ గాశీపురంబున కరిగి హసన్‌బాదు కోటలో బసచేసి యావీటంగల మేటి పండితులకెల్ల నాహ్వానపత్రికలు పంపెను ఆ పత్రికలం జూచుకొని పండితులు నిరసించుచు నీవు విద్వాంసుఁడవయ్యే గులభ్రష్టుండ వైతివి. ఇట్టి నిన్నుఁ జూచుటకు మేము రాము. నీ దర్శనము కలుషప్రదము. నీవు సంభాషణార్హుండవు కాదని ప్రత్యుత్తరము వ్రాసిరి. పండితభట్టు భార్య పుత్రునిరాక విని మగనికిఁ జెప్పకుండ నతని యొద్దకుఁ బోయినది. ఆమె రాక విని యతండు భార్యతో గూడ గొంతదూర మెదురు వచ్చి పాదంబులఁబడి నమస్కరించెను. కన్నీరుఁ గార్చుచు దీవించి కోడలిని మన్నించి నాయనా ! నిన్నుఁ గన్నందులకు నాకు సుఖమే గాని మఱేమియును లేదు. నీవు విద్యాగుణ సంపన్నుఁడవై కులమునకు ఖ్యాతి దెత్తువనుకొంటి నీ మూలమున మాకుఁ దలయెత్తుకొన వీలు