పుట:కాశీమజిలీకథలు -04.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చక్రవర్తికి సంతోషముఁ గలుగజేసిన ఫకీరునకు మిక్కిలి గౌరవము జరుగునని యొక వజీరు చెప్పియున్నాఁడు. అది యెవ్వరితరము కాకున్నది. అతనికూఁతుం బ్రతికించిన జరుగునట్టి పని నిదియే కోటలోనివృత్తాంతమని చెప్పిరి. ఆమాటవిని మాగురువుగారు మిగుల సంతసించుచు నమ్మఱునాఁడు నాఁతోగూడ ఖిల్లాలోనికి జనుదెంచి రాజదర్శనముఁగావించెను. మమ్ముఁ జూచి చక్రవర్తి సలాము మాత్రము చేసెను. అప్పుడు మాగురువుగా రొక్కింతతడ వూరకొని రాజా! నీవు దైవాంశసంభూతుండవయ్యు నన్యాయకార్యములఁ జేయబూనినచో దుఃఖముల పాలుగాక మానుదువా? ఇఁక నీవు విచారింప నవసరములేదు. నీశోక ముడిగించుటకే నేనువచ్చితిని నీ హృద్గత మెద్దియో చెప్పుము. నన్నే చెప్పుమంటివేనిం జెప్పఁగలను. చెప్పుటయేకాక నీకు సంతోషము గలుగఁజేయఁ గలనని పలికిన విని యతండు వెఱఁగుపడుచు మాదిక్కు మొగంబై స్వామీ! మీరు మహాత్ములుగదా? అది మీరే యెఱింగింపుఁడని పలికెను.

అప్పుడు మాగురువుగారు రాజా నీవు నిరపరాధినియైన కూతుం జంపించితినని విచారించుచుంటివి. ఆమాట సత్యము. ఆ సతీమణియం దించుకయు సపరాధము లేదు. సర్వోత్తముండైన పురుషుని బతిగా వరించినది. కాని స్వైరిణీవృత్తిఁ నాచరించ లేదు. కానిమ్ము ఆచిన్నది ధర్మాభిరక్షితయై బ్రతికియేయున్నది. నీవు విచారింపకుము. సెలవిచ్చితి వేనిఁ దీసికొనిరాగలనని పలికిన నతండు లేచి యతని పాదంబులఁబడి మహాత్మా! రక్షింపుము. రక్షింపుము. నీవు భగవంతుఁడవు. నాపుత్రికం దయచేయుము. క్రుద్ధుండనై ప్రాణమువంటి పుత్రికం జంపించితి నతిక్రూరుండఁ బాపాత్ముండనని యనేక ప్రకారముల వేడుకొనియెను. అప్పుడు మాగురువుగారు లవంగిం దీసికొని వచ్చుటకు సేనలతో నన్నుఁ బంపిరి. నేను వచ్చియా వృత్తాంత మంతయుం జెప్పి వారి నందలం బెక్కించి దీసికొని పోయి కోటలో నప్పగించితిని. మఱల నన్ను మీరిచ్చటికి వచ్చినఁ దీసికొని రమ్మనియు నంతదనుక నిందువేచి యుండమనియు నియమించిరి. దానంజేసి మీ రాక వేచియుంటి. మిమ్ముఁ బొడఁకంటి. నిఁక మనము ఢిల్లీకిఁ బోవలసినదని పలికెను. ఆ కథ విని పండితరాయలు 'అయ్యా! లవంగి సుఖియైనందులకు నే నెంతయు సంతసించితిని. నేను మాత్ర మచ్చటికి రాను. చూడ వలయునని యున్న లవంగి నెప్పటికై నం జూచెదను. ఫాదుషా చక్రవర్తికి వెఱచి నేనిట్టి వేశము వైచికొనలేదు. లవంగి నా నిమిత్తము బరిమార్పఁబడినదని విరాగినైతి. నిఁక మాయొక్క సామర్ధ్యమును జూతురుగాక యని యత్యాగ్రహముతోఁ బలుకుచున్న యతని యాకారము జూచి యాపురుషుండును గుందలతిలకయు భయపడుచు నేమియుం బలుకలేకపోయిరి. మఱి కొంతసేపటికి నలుకయుడిగి యప్పాఱుండు కుందలతిలకతో బోఁటీ? నీ విక నేమిటికి నాతోఁ దిరిగెదవు. నీసఖురాలిం గలసికొని సుఖింపుము మా దారి మాదని పలికిన నక్కలికి యిట్లనియెను.