పుట:కాశీమజిలీకథలు -04.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముసలి ఫకీరు కథ

71

ముసలిఫకీరు శిష్యుండను. ఆయన మీ నిమిత్తమే నన్నిం దుంచినాఁడు మీకు శుభము గలుగఁగలదు. నిజము జెప్పుమని యడిగెను. అప్పుడప్పడఁతి అయ్యో? నీమాట యేల రిత్తవోవును. నేను లవంగి సఖురాలినే. ఆ బ్రాహ్మణకుమారుఁడు కుమారు నెత్తుకొని యరుగుమీఁద గూర్చుండియున్నవాఁడు. ఆయనతో నా వృత్తాంతము చెప్పవచ్చును. వత్తురేయను పలికిన సంతసించుచు నాపురుషఁ డప్పుడే యక్కడికి పోయి పండితరాయలం గాంచి కాయముతో సలాముచేయుచు మసీదునకుఁ దీసికొనిపోయి కుశల మడిగి యుత్తీర్ణుఁడైనతరువాత నల్లన నిట్లనియె.

ముసలి ఫకీరు కథ

అయ్యా ! యీచిన్నది యిద్దఱిముద్దుగుమ్మలను మాగురువుగారి యొద్ద నునిచి యరగినవెనుక మాగురువుగారు లవంగి యాకారవిద్యాదివిశేషములు దెలిసికొని వెఱఁగుపడుచు నొకనాఁ డాయింతిం జూచి సాధ్వీమణీ! నీవు మిగుల గౌరవ కుటుంబములో జనించినట్లు కనఁబడుచుంటివి. పురుషసహాయములేక యిట్లూళ్ళ వెంబడి సంచరించుచుంటివేల? నీవృత్తాంత మేదియో గోప్యముచేసితివి. మాచేతనై నంత యుపకారము గావింతుము. నిక్కముఁ జెప్పుమని పలుమాఱుగ్రుచ్చి గ్రుచ్చి యడిగిరి. ఆయన మహానుభావుండని యెఱింగి లవంగియుఁ దనవృత్తాంత మంతయు నొకనాఁ డాయనకు జెప్పి స్వామీ! నేను శాస్త్రదూష్యమైనపని యేమియుం జేయలేదు. మా తండ్రికి నిష్కారణము నాపైఁ గోపమువచ్చి యట్లుకావించెను. దైవోపహతకురాల నే నేమిచేయుదునని యేడువఁ దొడంగినది.

ఆమాటలువిని యతి దయాళుండగు మాగురువుగారు జాలిపడుచుఁ దరుణీ! నీవు వెఱవకుము. నీకష్టము వాయఁజేసెదను. నీమనోహరుఁడు నాకత్యంతాప్తుండు అతం డీభూలోకమేగాక మూఁడు లోకములు నేల సమర్థుడు. నీపని యెఱుంగనుకాని యీకథ నేనువానివలన వింటి నీవలన లేశము దోషములేదు. చక్రవర్తి తెలియక యట్లు నియమించెను. నీమగండు నీవు మృతినొందితివని విరక్తినొందెనుగాని నిన్నుఁ గలిసికొనిన పాదుషాను సంగరంబున నోడించి ఢిల్లీరాజ్యముఁ గైకొనఁడా ? అయినను సామమునఁ గార్యము సాధింతును. నేనువచ్చు వఱకు నీవిందుండుము. మాశిష్యులే నిన్ను రక్షించుచుందురని యెన్నియో చెప్పి యాయన నన్నుఁ దనవెంటఁ బెట్టుకొని డిల్లీకిఁ బోయెను. ఆరాజధానిలో మేము మసీదులో బసజేసి ఫాదుషాగారి వృత్తాంత మందుఁగల ఫకీరుల నడిగితిమి. వారిట్లనిరి “ఇప్పుడు ఫాదుషా చక్రవర్తి దుఃఖ సముద్రములో మునిఁగియున్నాఁడు. ఎవ్వరికిని దర్శన మిచ్చుటలేదు. పకీరులకు దర్శనమిచ్చునుగాని తిన్నఁగా మాటాడఁడు రాజ్యము ప్రధానులే చేయుచున్నారు కాని యెవ్వరికిం జెప్పడు. ముందుఁ గూఁతుఁనిం జంపించి పశ్చాత్తాపతప్తుడై యట్లు మాడుచున్నాఁడని యొక ప్రతీతికలదు. అదిరహస్య ప్రసక్తి కావున వెల్లడింపరాదు.