పుట:కాశీమజిలీకథలు -04.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుందలతిలక కథ

69

గ్రామములు తిరిగితిమి. ఒక యూరిలో మసీదులోనున్న ఫకీరు త్రికాలవృత్తాంతములును ప్రశ్నలడిగినఁ జెప్పునని యా గ్రామస్థులు చెప్పగాఁ నేను పోయి యా మహాత్ము నాశ్రయించి మిమ్ము గుఱించి యెందున్నా రని యడిగితిని. ఆ వృద్దు నన్ను జూచి నీ వడిగిన కార్యమునకు ముఖ్యురాలవు నీవా? నీ కన్న ముఖ్యులుండిరా? యని యడిగిన నున్నారని చెప్పితిని. అట్టివారే యడుగవలయునునని చెప్పఁగా లవంగి నతని యొద్దకుఁ దీసికొనిపోతిని. ఆ చిన్నదానిం జూచి యా సన్యాసి యీ కాంత యిట్లు చింతించుచున్న దేమిటికని ప్రస్తావముగా నడిగెను. కాశీపురి కరుగుచుండ దారిఁలో బ్రసవమగుటయు బుత్రునెత్తుకొని యడవిలో నడచుచుండగా నెలుఁగుబంటి యా శిశువు నెత్తుకొని పోవుటయు లోనగు వృత్తాంత మంతయుం జెప్పి యప్పాపని నిమిత్తము విచారించుచుండెనని చెప్పితిని. అప్పుడతండు విస్మయముతో జూచుచు నేమేమీ? ఆ బాలుండు మీ బాలుండా? విచారింపనక్కరలేదు. ఒక పుణ్యాత్ముం డా బాలుని రక్షించినాఁడు. మొన్ననే యాతం డిచ్చటినుండి యెచ్చటికో పోయెను. ఆ భల్లూకము బారితప్పించి యా బాలునిఁ గైకొని పెంచుచుఁ బుత్రునికన్న నెక్కుడు ప్రేమతో జూచుచున్నాఁడు. మీరు విచారింప నవసరములేదు. నాతో నతం డీ కథఁ జెప్పెను. అతండు బాటసారిగావచ్చి కొన్నిదినము లిందుండెనని చెప్పెను.

ఆ మాటవిని లవంగి యుప్పొంగుచు స్వామీ! యా పుణ్యాత్ముండెవ్వండు? ఎందుఁ బోయెను? వాని పేరేమి? చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

బోఁటీ! యా పురుషుండు బ్రాహ్మణుఁడు అతని నివాసము కాశీపురము. గొప్ప విద్వాంసుఁడు, సామాన్యుఁడుకాడు. కాని దైవయోగమున నన్యకులకాంతం బత్నిగాఁ జేసికొనియెనఁట. దానివారలు తెలిసికొని గర్భవతియని సంకోచింపక చంపిరఁట. ఆ మాటవిని విరక్తుండై ఫకీరులలోఁగలసి తిరుగుచున్న వాఁడు. అతని బెడద మీకేల? మీ బాలుని రక్షించెను అతండు తఱచుగాఁ దీర్థముల కరుగుచుండును కావున వెదకి పట్టుకొనుఁడు. మీ కొమరుం జూడగల్గునని యా కథ యంతయుం జెప్పెను. ఆ మాటలువిని మే మొండొరుల మొగములు చూచుకొనుచు సంతోషపారావారావీచికలం దేలియాడుచు మా రహస్య మాయనకుం జెప్పక కర్తవ్యాంశములు మేము మువ్వురము విచారించుకొంటిమి. పిమ్మట నేనాయనతో స్వామీ! నేనుపోయి వెదకి యా బ్రాహ్మణునిం గలిసికొని యా బాలునిం దీసికొనివచ్చెద నంతదనుక వీరిద్దఱు మీ యొద్దనుందురు పరోపకారపారీణుల కెల్ల వారును బంధువులేకదా. విశేషించి దిక్కుమాలినవారియం దెక్కుడు కనికరముఁ జూపుదరు. మీ రించుక కృపారసంబు వీరిపై ప్రసరింపజేయుచుండిన శుభములు చేకూరక మానవు సత్వరముగాఁ పోయి వత్తుననియా యవనఋషిని స్తోత్రములు చేయుచు నతం డొడంబడిన పిమ్మట నేను బయలుదేఱి యనేక తీర్థంబులు తిరిగితిని. పెక్కు శైలములకుం జనితిని. బహుపట్ట