పుట:కాశీమజిలీకథలు -04.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చుండిరి. లవంగి తన మనోహరునకుఁ గుమారుని జూపు నుత్సుకముతో వెండియుఁ బయనము సాగించి వేగముగాఁ గాశికిఁ బోవలయునని చెప్పినది. కాని నడుచునప్పుడు నాకుఁ బ్రాణముమీదిఁకి వచ్చుననియెంచి మఱి రెండు మాసములు జరుగువఱకుఁ బయనము సాగనిచ్చితినికాను. ప్రతి దినము వేపుచుండ నెన్ని దినములు గడుపుదును? మఱియొకనాఁ డా బ్రాహ్మణులచే ననిపించుకొని శిశువు నొకభుజముపై నిడుకొని లవంగిని రెండవచేతితోఁ బట్టుకొని ఒక నిశావసానమున నా యగ్రహారము విడిచి నడువఁ దొడంగితిమి. ఆబోఁటి మాటలెన్నేనిం జెప్పినది కాని నడుచునప్పుడు మునుపటికంటె నాలస్యముచేయఁ దొడంగినది. ఆ దారినడవులేగాని గ్రామములేవియుఁ దఱచు గనంబడవు.

అట్లు నాలుగు దినములు నడిచితిమి. నాకు నూఱుగజములు దూరములో నుండినది. పిల్లవాని నెత్తుకొని నేను ముందు నడుచుచుండ నొకనాఁడు మధ్యాహ్నమున నాకొక భల్లూకమెదురై బొబ్బలిడుచు నాపైఁ బడవచ్చినది. అప్పుడు జడియుచు నేను వెఱ్రికేకలు వైచి యేమియుం దోఁచక యా ముద్దుపట్టిని జాటున నేలపై బెట్టి నే నొకమూలకు బోయితిని. అప్పుడా యెలుఁగబంటి యా చంటిపిల్ల వాని కడకు పోయి యెత్తుకొని నన్ను వెక్కిరించుచు నా ప్రక్కనున్న యరణ్యములోనికి పోయినది. అప్పుడు నేను వట్టిచేతులతో నిలిచి గోలున నేడ్చుచు నిలువంబడితిని. ఇంతలో లవంగివచ్చి నన్నుఁ గలసికొని జరిగినకథ విని పెద్దయెలుంగున నయ్యరణ్యము ప్రతిద్వని యిచ్చునట్లేడువఁ దొడంగినది. నేను బెద్దతడ వోదార్చితిని. అబ్బా! నాఁటిసంగతిఁ దలచుకొనిన నిప్పుడుగూడ గుండెలు కొట్టుకొనుచున్నయని చూడుము? లవంగి యేడ్చినధ్వని యిప్పటికి నా యడవిలో జెట్లవెంబడి బయలువెడలు చండును. భల్లూకము నన్ను జంపినను జంపుగాక నా ముద్దుబాలుని దానిపాలుసేసి యూరకొనఁజాలను. నేనుగూడ నయ్యడవిలోనికి పోయెదనని లవంగి సాహసము చేయుచుండ బలాత్కారముగాఁ బట్టుకొని విరక్తి మాటలం జెప్పుచు నెట్టకే మఱలించి నడిపించుచు నాఁటిరేయి కొకపల్లెఁజేరితిమి. అందు రెండు దినములుండి వెండియు బయలుదేఱి కొన్నిదినముల కీయూరు చేరితిమి. ఇందీ లవంగికి దేహములో నామయము జేసినది. అందులకై యిందు వసియించి యుంటిమి. ఇప్పుడు కొంచెము నెమ్మదిగా నున్నది. ఇదియే మా వృత్తాంతము కుందలతిలకా! నీవేమేమి చేసితివి ? ఎచ్చటెచ్చటఁ గ్రుమ్మఱితివి ? వీరుండేమనియెను ? మా కథ యాయనకుం దెలిసినదా ? ఇప్పుడు కాశీపురిలోనే యున్నవాఁడా యని యడిగిన నా వృత్తాంతమంతయుం జెప్పితిని. మీ జాడ తెలియక చింతించితిరి.

మేమందఱముఁ గలసి యందు మఱి నాలుగు దినములు వసించి మీ మాటలే చెప్పుకొనఁ దొడంగితిమి. మీరు తనకై యడలుచుందురని లవంగి మిక్కిలి చింతించుచున్నది. అచ్చట బయలుదేఱి మేము మీ జాడఁ జూచికొనుచుఁ బెక్కు