పుట:కాశీమజిలీకథలు -04.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చూచి చూచి దానివెంట నరిగితిని. అదియు నొకబ్రాహ్మణగృహమున కరిగినది. ఆవాకిట నిలువంబడి యొకరితో నీచిన్నది యెవ్వతెయని యడిగితిని. ఆమె యొకబాటసారి కాశికిఁ బోవుచు నిన్న నీ యూరిలో బసచేసినది. ఆమెతో మఱియొక చిన్నది యున్నది వారి మగవారు ముందుబోయినారట. రెండవ చిన్నదానికి మగశిశువు గలిగి రెండునెలలక్రిందట జారిపోయినాఁడఁట. అందులకే కాఁబోలు నా చిన్నది సంతతము విచారించుచుండును. ఇంతకన్న వారికథ మాకు దెలియవని యచ్చటివారు చెప్పిరి. ఆ మాటవిని నేను నెఱంగుపడుచు మెల్లగా నా లోపలకుం బోయితిని. నన్నుజూచి లవంగి గోలున నేడ్చినది. అప్పుడు నేనది లవంగి యని గుఱుతు పట్టితిని. వారిఁజూచి నేనును విచారించుచు నయ్యో? మీరు చచ్చినారని విరక్తితోఁ దిరుగుచుంటిని. యిచ్చటికెట్లు వచ్చితిరి. మీ వృత్తాంతమేమో చెప్పుమని యడిగిన సంగీతచంద్రిక యిట్లనియె.

సఖీ! నీ వుండగనే తోటలో గుజగుజలు పుట్టినవికద? మఱిరెండు దినములకు గూఢచారులు హాసన్‌బాదుకోటలోని కరిగి గుప్తమార్గము దెలిసికొనిరి. అందు లవంగి వీరునకు వ్రాసిన యుత్తరమొకటి నా చేతి నుండి జారిపడినది చీఁకటిలోనాకు దొరికినది కాదు. అది వారలకు దొరికినది. విధివిధానము దాటింప నెవ్వరితరము? ఆ యుత్తరము చూచి యంతకుమున్ను విన్న సంగతులు నిశ్చయమని తలంచి చక్రవర్తి మండిపడి మమ్ము నిద్రబోవుచుండఁ జంపిరండని కింకరుల కాజ్ఞ యిచ్చెనంట. ఆరహస్యము పెద్ద బిబ్బీ తెలిసికొని యొక బ్రాహ్మణునిచే మాకావార్తఁ దెలియజేసినది. ప్రొద్దు గ్రుంకక పూర్వమే మాకా రహస్యము బ్రాహ్మణుఁడు చెప్పిపోయెను. మేము వినిపించి కొననట్లుండి లవంగి పరుండెడి హంసతూలికాతల్పంబున ననఁటిబొంద నునిచి వస్త్రమాల్యానులేపనాదులచే స్త్రీయాకారముగా నలంకరించి సన్ననివలువఁ గప్పి నిద్రబోవునట్టు నిలపితిని. ఆ ప్రాంతమునందే నాయాకృతియు నొప్పునట్లుచేసి లవంగి దూరముగా నుంచి నేనా రహస్యము చూచు తలంపుతో దాపున దాఁగి యుంటిని.

అర్ధరాత్రసమయంబున భయంకరవేషములతో రాజభటులు కొందఱువచ్చి లవంగి పరుండియుండు తల్పము వెదకికొనుచుఁ దల్పంబున నున్న కృత్రిమవిగ్రహములఁ దునియదునియలుగా నఱికి యా పఱుపుతోడఁ జుట్టి మోసికొనిపోయి కందకములో నూరద్రొక్కి తమలోనఁ వారు పోయిరి. అప్పుడు నేను గుండెలు తటతటఁ గొట్టుకొనుచుండ లవంగి చేయిపట్టుకొని ఇంతీ? మనమిం దిందుండరాదు. నిజము తెలిసినచో మానహానియుఁ బ్రాణహానియు గాఁగలదు. కుందలతిలకయు వచ్చినదిగాదు. రహస్యముగా నీవీడ వదలి గుట్టుగాఁ గాశీపురి కరిగి నీ మనోహరుం గలసికొనుటయే యుచితమనిచెప్పి నట్లనే బయలుదేఱి ముసుఁగులు వైచికొని యెవ్వరికిం దెలియకుండ నరణ్యమార్గమున నడువసాగితిమి. ఆపదలయం దెట్టి