పుట:కాశీమజిలీకథలు -04.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భల్లూకదత్తుని కథ

63

శిశువులం బెనుచుచుండును. వానిలో వానరములు మిక్కిలి తెలివిగలవి. ఈ భల్లూక శిశువు మనుజశిశువువోలె రొదజేసినది. ఈ చిత్రము చూడవలయునని తలంచి మఱి కొంతసేపున కాగూటి యొద్దకుఁబోయి యబ్బురపాటులో నందుండి యాపాపని నెత్తుకొని యిట్లు తలంచెను. ఆహా ! ఈ పట్టి మనుష్య శిశువు వీనికారు మాసముల ప్రాయమున్నది. దీని రూపము లక్షణములు చూడఁ జక్రవర్తి కుమారుండువలె నున్నవాఁడు ఇట్టి పసికూన యిచ్చటికెట్లు వచ్చెనోకదా? యీ యెలుఁగుబంటి వీనిఁబెంచుటమఱియు విచిత్రముగానున్న యది లేక భల్లూకమే వీనింగనినదా ఇట్టి చోద్యములెప్పుడు వినికని యెఱుంగమని యనేక ప్రకారముల దలంచుచు మఱియు మఱియు నా శిశువుం బరీక్షించుచు నేడ్పించి మనుష్య శిశువగుట నిశ్చయించెను.

అయ్యారే ? ఇట్టి ముద్దుబాలు నేముద్దియగనినదో ? యెవ్వఁడు కొమారుండని మురిసెనో ? వారిప్పు డెట్టివిచారము జెందుచుందురో ? పాపమీ పాపడీ యెలుఁగు బారింబడియుండిన మోసముఁ జెందకుండునా? ఇది యెప్పుడో వీనిం గడతేర్పక మానదు. క్రూరమృగము మనుజశిశువున కిట్టియుపచారములు చేయుట దై వకారణము కాని మఱియొకటికాదు. ఏదియెటులయినను నేను వీని నిప్పు డిచ్చటనుండి తీసికొని పోవుటయే యుచితము. భల్లూక మడ్డము వచ్చినచో నా బడియతో మోదిసమయించెదనని నిశ్చయించి యాబాలుని భుజముపై నిడుకొని రెండవచేత దండముదాల్చి నలు దెసలం బరికించి యెలుఁగుజాడ నరయుచు నతివేగముగా నా కొండదిగి వెనుకటిదారింబడినడుచుచు గ్రమంబున నయ్యరణ్యంబుదాటి నాఁటిసాయంకాలమున కొకపల్లెం జేరెను.

ఆ రాత్రి పాలుయాచించి తెచ్చి యబాలునకుఁ బోసి ముద్దుబెట్టుకొనుచుఁ గట్టా?: దైవము నాకిట్టి పుత్రుందయసేయక సన్యాసింజేసెంగదా ? లవంగి గర్భవతియైనదనివింటిని. ఆ యించుబోణి జీవించియుండి పుత్రుంగనినచో నా శిశు వింతప్రాయములో నుండునుగదా. అట్టి యదృష్టము నా కేలపట్టును. పరమనిర్భాగ్యుండ నని విచారించుచు నా బాలుని బక్కలో నిడుకొని యా రాత్రి నిద్రబోవక వేగించెను. క్రమ క్రమముగాఁ బండితరాయలు కాబాలునియం దనురాగమెక్కు డైనది. సంతతము వానినే ముద్దువెట్టుకొనుచు నవ్వించుచు లాలించుచు బలికించుచుఁ బ్రాణములకన్న నెక్కుడు తీపిగాఁ బెనుచుచుండెను. పూర్వమడవుల వెంబడి తిరిగెడునతం డాబాలుని సంరక్షణ నిమిత్త మప్పటినుండియు గ్రామముల ననుసరించి తిరుగుచుండెను.

ఒకనాఁడతం డాడింభకు నెత్తుకొని యొక గ్రామముఁజేరి యందుగల మసీదునకుం జనియెను. అందుఁ బెక్కండ్రు ఫకీరులు వసియించి యుండిరి. ఒకరి నొకరు పలుకరించుకొనిన వెనుక నందొక ముసలి ఫకీరు పండితరాయల కిట్లనియె. అయ్యా ! నీయాకారము జూడ గడువిరక్తుఁడ వైనట్లుతోచుచున్నది. ఉత్తమమైన యాశ్రమము స్వీకరించియు నీ పిల్లవానిం దీసికొని వచ్చితివేల ? నీ కేమికావ