పుట:కాశీమజిలీకథలు -04.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నుంచిరి. మన పట్టియు నా బాలికయు రూపంబునఁ బ్రాయంబున నొక్క తెఱంగున నుండుట జ్ఞాపకమున్నదియా?

భ - జ్ఞాపకమున్నది. ఆ కథయంతయు నేనెఱుంగనని చెప్పుచుంటివా యేమి? మన పట్టి కూపంబునంబడి సమయముబట్టియే మన మిట్లనపత్యులమై యుండవలసి వచ్చినది. లేకున్న నదియు లవంగియంత యుండును. ఆ కధఁ చెప్పుకొని యిప్పుడు దుఃఖింపనేల?

భా - వినుండు. అప్పుడు కూపంబునంబడి సమసినది మన పుత్రికకాదు. రాజపుత్రికయే. మనపుత్రిక యని నేనట్లు చెప్పితిని.

భ - ఏమిటి? ఈ లవంగి మనపుత్రికయే! ఏమిటి కట్లు చెప్పితివి.

భా - అమ్ముద్దియ నశ్రద్ధగా జూచితిమని రాజు కోపించునని యొకటి. ఎటులైన మనపుత్రిక సామ్రాజ్యపదవి ననుభవించినం జాలునని యొకటి. ఈ రెండు కారణములచే నట్లుబొంకతిని. ఇద్దఱి బాలికల రూప మొక్కటిగా నుండుటచే నా భేదము నేనుగాక మఱియెవ్వరును గనుంగొనలేక బోయిరి.

భ - ఓసి నిర్భాగ్యురాలా? ఎట్టిపనిజేసితివే. అన్నన్నా! సిరికాసించి వంశచ్ఛేదము చేయుదురా. అయ్యో? ఈ పాటికి మనకు దౌహిత్రలాభము గలుగ పోయినదా? స్త్రీ స్వభావము కపటమైనదికదా. అని పలుకుచు నతండు విచారింప దొడంగెను.

పండితరాయ లాసంవాదమంతయు విని పెద్దతడవు నిశ్చేతనుండై పడి యుండి యెట్టకేఁ దెప్పరిల్లి యుల్లంబు తల్లడిల్ల హా లవంగీ? హా కోమలాంగీ? హా సుగుణ తరంగిణీ? నా కతంబున నీవు బలవన్మరణము నొందింపఁబడితివి. అయ్యో? నే నెంత కఠినుండనో కదా? నీ వార్తవిని వెంటనేవచ్చి రక్షించుకొనలేక పోయితిని. ఆ పాడుసభ లానాఁడు నా కేల మూడవలయును. అన్నన్నా? నీ ప్రేమ, నీ యనురాగముఁ వలఁపు నీ చాతుర్యము, నీ యౌదార్యము, నీ సోయగము, నీ మాధుర్యము, నీ మృదువు వేయిజన్మములకైన మఱపువచ్చునా? నీ వైదుష్యము సరస్వతికైనం గలదా? అబ్బా? నాకొఱ కెన్ని యిడుమలం బడితివి. ఎన్ని యుక్తులం బన్నితివి. అక్కటా? అన్నిగతులం గొనియాడంబడెడు నీదుజాతిగుఱించి నా చిత్త మించుక యేవగించుచుండునది. వీరి మాటలచే నీ కట్టి కళంకముగూడ లేనట్లు తేలినది. నీ వంటి భార్య నా వంటి పాపాత్మునకుఁ దక్కునా? ఏమనుకొనుచుంటిని? నే నిప్పు డెక్కడ నుంటిని? ఇది కలయా? నిక్కువమా? ఈ బ్రాహ్మణుని మాటలు బొంకులు కాకూడదా? అట్లేయగును సందియములేదు. అయ్యో: నాకుఁ బిచ్చియెత్తినది. కాదిది యున్మాదము. కాదు మరణ వికారము. అటులైన లెస్సయేకదా. పరలోకంబున నాకోకస్తనిం గలసికొందును. ఇసిలో? నా యసువు లెంతకృపణములైనవో యా సతీమణి మరణవార్త వినియును గదలగున్నవి. సీ! నాకీజన్మముతోఁ బనిలేదు. మృతి