పుట:కాశీమజిలీకథలు -04.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఢిల్లీ పాదుషాగారి కథ

55

స్వామీ! మీకటాక్షలేశము నాపయిం బ్రసరించుచుండ నేను గృతర్థుండఁగా కేమయ్యెదను. అదియట్లుండె నాలవంగి తండ్రితో నరిగినదా? ఆమెను బండితరాయలు భార్యగా స్వీకరించెనా? బ్రాహ్మణులు సమ్మతించిరా? తరువాతి వృత్తాంతము కొఱంతగానే చెప్పితిరి. దయతప్పినదాయేమి? ప్రశ్నకుత్తరంబైనను సగము కథఁచెప్పి యూరకొనుట యుచితమా? కాక మదీయగ్రహణధోరణి యెట్లున్నదోయని పరీక్షించుటకా? కటాక్షించి తదనంతరవృత్తాంత మెరింగింపుడని వేడుకొనినవిని యతిచంద్రుఁడు దరహాసచంద్రికలఁ దెసలఁ బ్రకాశింపజేయుచు నిట్లనియె. వత్సా! నీ వీప్రశ్నము చేయుదువని యనుకొనుచునే యుంటిని. అంతటితో విడుతువా? నీయభిలాష నేనెఱుంగనిదా? కానిమ్ము ఇప్పుడు ప్రొద్దుపోయినది. తరువాయికథ పెద్దదిగా నున్నది. ముందరియవసధంబున వక్కాణించెదనని యొప్పించి క్రమంబున నాపైమజిలీచేరి యందు భోజనాదికృత్యములు నిర్వర్తించు కొనిన పిమ్మట దరువాతకథ యిట్లని చెప్పందొడఁగెను.

ముప్పదియాఱవ మజిలీకథ

గోపా ! వినుమట్లు విశ్వేశ్వర మహాలింగమునకు మహాదీక్షఁ గావించి పండితరాయలకు మహావీరుండని బిరుదమిచ్చినతరువాతఁ పండితభట్టుపుత్రునకు వివాహముఁజేయ నెక్కుడుప్రయత్నముఁగావించెను గాని పండితరాయలు లవంగి యందు బద్ధాదరుండై యున్నకతంబున నప్పనికి సమ్మతించినవాఁడు కాఁడు. ఒకనాడతండు లవంగి శృంగారక్రీడావిశేషంబులం దలంచుకొని విరహాతురుండై చింతంచుచున్న సమయంబున లవంగి సఖురాలు కుందలితిలక యచ్చోటికివచ్చి వెదకి కనుంగొని పండితరాయలకు నమస్కరించినది. అప్పుడతండు ముప్పిరిగొను సంతసముతోఁ దదాగమనము గుఱించి యభినందించుచు మించుబోణీ! నీసఖురాలు సుఖియై యున్నదియా? నిన్నేమని చెప్పుమన్నది. విశేషము లేమని యడిగిన నప్పడఁతి యిట్లనియె. ఆర్యా! మీరు రాజకార్యములు చక్కఁబెట్టుకొని వెంటనే వత్తుననిచెప్పి యింతదాక రాక యుపేక్షించితిరిగదా. ఇఁక నాసఖురాలి సేమమేమని వక్కాణింతును. ప్రతిదినము మీరువత్తురని మీదేశవంక చూచువఱకుఁ గన్నులు కాయలుకాచినవి. ఇప్పుడేమి చెప్పుదును. వచ్చినపిమ్మట మీకే తెల్లమగుంగదా. అదియట్లున్నను మరియొక యుపద్రవము కానైయున్నది వినుండు. చక్రవర్తి యచ్చటినుండి వచ్చినది మొదలు లవంగియం దిష్టములేక యుపేక్షగా నుండెను. పూర్వము సంతతము నానెలంతువనే పరామరిక చేయుచుండవాఁడు. ఇప్పు డొకమారైనను దలపెట్టడు. మనగుప్తమార్గప్రచారమంతయు మాశత్రువు లెవ్వరో తెలియజేసిరి. ఇప్పుడామార్గము విమర్శించి రండని రహస్యముగ గొందరుగూఢచారులఁ బంపినట్లు వినవచ్చినది అదియునుంగాక లవంగికి నెలదప్పినది. నాలుగుమాసములు గతించినవి. ఈయాపద యెట్లుదాటునో తెలియదు. అంగజాలలమగు మాలో మాకుఁ గలతలు పుట్టినవి. ఇంక .