పుట:కాశీమజిలీకథలు -04.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నంతఃపురరహస్యములు దాఁగవు? నీవువేగవచ్చి యచ్చిగురుబోఁణిని రక్షించుకొమ్ము. మంచికొమరుం డుదయించు నని భోధించిన విని యతండు శిరఃకంపముఁ జేయుచు నిట్లనియె.

మచ్చెకంటీ! నేను వచ్చి మీనెచ్చెలియావడి యుడిగింతును. మీరు చింతింపకుఁడు. మద్భుజపంజరవర్తిని యగు నవ్వరవర్ణిని నవమానింపఁ జక్రవర్తితరమా? అతం డాయండజాన నాయండనుండు టెరుంగఁడుకాఁబోలు కానిమ్ము. నీవుముందు పోయి యాయిందువదన కీతెఱం గెఱింగింపుము. ఎల్లి నేడిల్లీపురంబునకు వత్తునని యెన్నియో బోధించి యాకన్నియ నన్నగరమున కనిపెను. అమ్మఱునాఁడు పండితరాయలు తల్లిదండ్రు లెఱుంగకుండ ఢిల్లీపురంబున కరుగఁదలంచెను. ఆదివసమునఁ గాశీపట్టణంబున దశాశ్వమేధఘట్టంబున నొక విద్వత్సభ జరిగినది. అందుఁ బండితరాయలసు బరీక్షకునిగాఁ గోరికొనిరి. దానంజేసి యతని కప్పనిఁ దప్పించుకొని పోవుటకు వీలుపడినదికాదు. ఆసభ యవిచ్ఛిన్నముగాఁ బదిదినములు జరిగినది. పిమ్మట నాలుగుదినములు వేఱొక యంతరాయములు తటస్థించినవి. ఈరీతిఁ బదియేనుదినములవఱకు నతనిపయనము సాగినదికాదు. పండితరాయలచిత్త మెల్లప్పుడు లవంగియందే వ్యాపించియున్నది. గావున మఱియొకనాఁడెవ్వరికిం జెప్పక యొక్కరుండు సామాన్యవేషముతోఁ గాశీపురి బయలువెడలి కతిపయప్రయాణంబుల ఢిల్లీపురంబునఁ కరిగి కుందలతిలక యెఱింగించిన యుద్యానవనమునకు గురుతుగాఁ జేరెను. అప్పటికి గొంచెము చీఁకటిపడినది. ఎవ్వరినడిగిన నేమి వచ్చునోయని జడియుచు నతండాచీకటిలో నిటునటు తిరుగుచు నెవ్వరేని గనంబడిన వారితోఁ గొంతదూరము పోయి మఱల వెనుకకు పోవుచు నేమి చేయుటకుం దోచక హృదయంబున నెద్దియోబీతు గదుర వెదురుతనంబునఁ గ్రుమ్మరుచుండెను.

అట్లు జాముప్రొద్దుపోవువరకుఁ దిరిగిదిరిగి కాళ్ళు నొప్పి పెట్టినంత నా ప్రాంతమందలి యొకగృహస్తు నరుంగుపై గూర్చుండి లవంగి జాడ యెట్లుతెలియనగుననిఁ పరిపరిగతులఁ జింతించుచుండెను. అప్పుడాయింటిలో వృద్ధులగు భార్యాభర్తలు సంభాషించుకొను మాట లిట్లువిననయ్యెను.

భా - ప్రాణేశ్వరా! పెద్దబిబ్బీ మిమ్మాదివసంబునఁ బిలిపించినదిగదా? ఏమిటికో చెప్పుఁడు నేనప్పుడే యూరికిఁ బోవుటచే నాకుఁ దెలిసినదికాదు. పుత్రికి వివాహప్రయత్నమునకా యేమి ?

భ - (నిట్టూర్పుతో) అయ్యో: కర్ణకఠోరమైన యాకథ నీకేమని వక్కాణింతును. వినినచో నాహృదయము భేదిల్లక మానదు. రాజులు కడు కఠినహృదయులు కదా.

భా — ఏమి యేమి? లవంగి క్షేమముగానున్నదా?

భ - అంతా క్షేమమే (అని డగ్గుత్తికచేఁ గన్నులఁ నీరు గ్రమ్మ నొక్కింత తద